విశాఖ వన్డే : భారత్ భారీ స్కోర్

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 12:00 PM IST
విశాఖ వన్డే : భారత్ భారీ స్కోర్

Updated On : December 18, 2019 / 12:00 PM IST

విశాఖ వేదికగా విండీస్ తో రెండో వన్డేలో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నస్టానికి 387 పరుగులు చేసింది. విండీస్ ముందు 388 పరుగుల టార్గెట్ ఉంచింది. ముందు బ్యాటింగ్ చేసిన కొహ్లీ సేన.. ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగారు. విండీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. వారికి చుక్కలు చూపించారు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. చివరి ఓవర్లలో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయారు. విండీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

ఓపెనర్లు టీమిండియాకు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. రోహిత్ శర్మ (159 రన్స్.. 138 బంతులు.. 17 ఫోర్లు, 5 సిక్స్ లు), కేఎల్ రాహుల్ (102 రన్స్.. 104 బంతులు.. 8 ఫోర్లు, 3సిక్స్ లు) సెంచరీలు బాదగా.. ఆఖర్లో యువ హిట్టర్ రిషబ్ పంత్ (39 రన్స్.. 16 బంతులు.. 3 ఫోర్లు, 4 సిక్స్ లు), శ్రేయస్ అయ్యర్ (53 రన్స్.. 32 బంతులు.. 3 ఫోర్లు, 4 సిక్స్ లు) మెరుపులు మెరిపించారు. 

తొలి వన్డేలో 288 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేజ్ చేసి విక్టరీ కొట్టిన విండీస్.. వైజాగ్‌లోనూ ఛేదనకే పొలార్డ్ మొగ్గు చూపాడు. అయితే పొలార్డ్ అంచనాలు తారుమారు అయ్యాయి. భారత బ్యాట్స్ మెన్ వీరబాదుడు బాదారు. 107 బంతుల్లోనే రోహిత్ శర్మ శతకం సాధించగా, ఆ తర్వాత కాసేపటికే 102 బంతుల్లోనే రాహుల్ కూడా సెంచరీ నమోదు చేశాడు. ఈ జోడీ తొలి వికెట్‌కి 37 ఓవర్లలో ఏకంగా 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ జట్టు తిరుగులేని స్థితికి చేరుకుంది. సెంచరీ తర్వాత కేఎల్ రాహుల్ ఔటవగా.. ఆ తర్వాత వరుస సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ కూడా కాట్రెల్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. రోహిత్ ఔట్ తర్వాత 44వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ తన పవర్ హిట్టింగ్‌తో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు.

శ్రేయస్ అయ్యర్ కూడా 47వ ఓవర్‌లో చెలరేగాడు. స్పిన్నర్ రోస్టన్ ఛేజ్ వేసిన ఆ ఓవర్‌లో వరుసగా 1 (నోబాల్), 1, 6, 6, 4, 6, 6 బాదాడు. 2 ఓవర్ల వ్యవధిలోనే టీమిండియా ఏకంగా 55 పరుగులు పిండుకుంది. ఆఖర్లో పంత్, శ్రేయస్ ఔటవగా.. జాదవ్ ఆశించిన మేర హిట్టింగ్ చేయలేకపోయాడు.

దీంతో.. ఒకానొక సమయంలో చాలా ఈజీగా 400 పరుగుల మార్క్‌ని అందుకునేలా కనిపించిన భారత్.. 387 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వన్డే కెరీర్ లో రోహిత్ కు ఇది 28వ సెంచరీ. 2019లో 7వ సెంచరీ. ఒకే ఏడాదిలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ రికార్డ్ క్రియేట్ చేశాడు హిట్ మ్యాన్. వన్డే కెరీర్ లో రాహుల్ 3వ సెంచరీ నమోదు చేశాడు.

భారత్ బ్యాటింగ్ : 
రోహిత్ శర్మ – 159
కేఎల్ రాహుల్ – 102
అయ్యర్ – 53
పంత్ – 39

వెస్టిండీస్ బౌలింగ్ :
కాట్రెల్-2
జోసెఫ్, పొలార్డ్, పాల్ కు తలో వికెట్