Team India lords tension start after watch wtc final 2025
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రసవత్తరంగా సాగుతోంది. బౌలర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. తొలి రోజు 14 వికెట్లు నేలకూలగా, రెండో రోజు అన్నే వికెట్లు పడ్డాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్ పై ఆధిక్యం ఇప్పటికే 200 దాటిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో దక్షిణాప్రికా విజయం సాధించాలంటే అసాధారంగా ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్.. లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ వేదికగా జరుగుతోంది.
ఈ మ్యాచ్ సంగతి కాస్త పక్కన బెడితే ఇప్పుడు టీమ్ఇండియాకు ఓ టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడనుంది. తొలి మ్యాచ్ జూన్ 20న హెడింగ్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్ జూలై 10 నుంచి 14 వరకు జరగనుంది. ఈ మ్యాచ్‌కు లార్డ్స్ మైదానమే ఆతిథ్యం ఇవ్వనుంది.
లార్డ్స్ టెన్షన్ మొదలు..?
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ చూస్తున్న భారత క్రికెట్ అభిమానులకు ఇప్పుడు ఓ సందేహం పట్టుకుంది. పేస్ పిచ్‌లపై ఎక్కువగా ఆడే దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా బ్యాటర్లే లార్డ్స్‌లోని మైదానంలో బ్యాటింగ్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది.. స్పిన్ పిచ్‌లపైనే ఎక్కువగా ఆడే భారత బ్యాటర్లు లార్డ్స్‌లో ఎలా రాణిస్తారోననే కంగారు మొదలైంది.
సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు లేకపోవడంతో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఆడిన అనుభవం ఉన్న కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ పైనే భారత్ బ్యాటింగ్ ఎక్కువగా ఆధారపడే అవకాశాలు ఉన్నాయి.
కాగా.. బౌలింగ్ విషయంలో మాత్రం ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం. పేసర్లకు పిచ్ నుంచి సహకారం లభిస్తే బుమ్రా ఎంతలా చెలరేగిపోతాడో ఆస్ట్రేలియా పర్యటనలోనే చూశాం. అతడికి సిరాజ్, అర్ష్‌దీప్ లు సహకారం అందిస్తే మాత్రం ఇంగ్లాండ్ బ్యాటర్లకు చిక్కులు తప్పవు.
టెస్టు సిరీస్‌లో భారత్ కు పేస్ పిచ్‌లతో స్వాగతం పలికేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న లార్డ్స్ పిచ్‌ను చూస్తే.. ఇంగ్లాండ్ పర్యటన భారత్‌కు కత్తిమీద సాములాగానే కనబడుతోంది. మరి ఈ పరీక్షను యువ ఆటగాళ్లు ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.
భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..
తొలి టెస్టు – 2025 జూన్ 20 నుంచి 24 వరకు – హెడ్లింగ్లీ, లీడ్స్
రెండో టెస్టు – 2025 జూలై 2 నుంచి 6 వరకు – ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
మూడో టెస్టు – 2025 జూలై 10 నుంచి 14 వరకు – లార్డ్స్, లండన్
నాలుగో టెస్టు – 2025 జూలై 23 నుంచి 27 వరకు – ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్
ఐదో టెస్టు – 2025 జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు – ది ఓవల్, లండన్.