Gautam Gambhir : ‘ఇంత కంటే మంచి సమయం మరొకటి ఉండదు..’ రోహిత్, కోహ్లీ, అశ్విన్ టెస్టు రిటైర్‌మెంట్లపై గంభీర్ కామెంట్స్..
ఇలాంటి సమయం మళ్లీ మళ్లీ రాదని, ఏదైన ప్రత్యేకంగా చేసి తమను తాము నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం అని భారత కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.

ENG vs IND Team India head coach Gautam Gambhir says this is the right time
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జూన్ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లు సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో కుర్రాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఎలా ఆడతారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా.. ఇలాంటి సమయం మళ్లీ మళ్లీ రాదని, ఏదైన ప్రత్యేకంగా చేసి తమను తాము నిరూపించుకోవడానికి యువ ఆటగాళ్లకు ఇదే సరైన సమయం అని భారత కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు.
టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే భారత జట్టు ఇంగ్లాండ్‌కు చేరుకుంది. ప్రాక్టీస్‌ను మొదలు పెట్టింది. ఈ క్రమంలో జట్టును ఉద్దేశించి గంభీర్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేసింది.
View this post on Instagram
ఈ వీడియోలో గంభీర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మనం ఉన్న స్థితిని రెండు కోణాల్లో చూడొచ్చునని చెప్పాడు. ‘మొదటి కోణం.. మనం ముగ్గరు సీనియర్ ఆటగాళ్లు (రోహిత్, కోహ్లీ, అశ్విన్) ఆటగాళ్లు లేకుండానే ఆడనున్నాం. ఇక రెండో కోణం దేశం కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయడానికి మనకు అద్భుతమైన అవకాశం ఉంది. ఈ బృందంలో అభిరుచి, కోరిక, ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే నిబద్ధత ఉందని నాకు అనిపిస్తుంది.’ అని గంభీర్ తెలిపాడు.
WTC Final 2025 : టెస్టుల్లో బుమ్రా రికార్డును బ్రేక్ చేసిన రబాడ.. ఆసీస్ పై ఒకే ఒక్కడు..
కొన్నింటిని త్యాగాలు చేయడంతో పాటు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలన్నాడు. అప్పుడు పోరాటం ప్రారంభిస్తే ప్రతి రోజూ, ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి బంతిని చిరస్మరణీయంగా మలుచుకోవచ్చునని చెప్పాడు. ఈ రోజు నుంచే దీన్ని అలవాటు చేసుకోవాలని, దేశం కోసం ఆడడం కంటే పెద్ద గౌరవం మరొకటి ఉండదని గంభీర్ చెప్పాడు.