Wimbledon 2025 : భారీగా పెరిగిన వింబుల్డన్ టోర్నీ ప్రైజ్‌మనీ.. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ కంటే ఎక్కువ..
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు.

Wimbledon 2025 prize money is $73million
ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. ఈ ఏడాది ఈ మెగాటోర్నీ నగదు బహుమతిని రూ.624 కోట్లుగా నిర్ణయించారు. గత సీజన్‌తో పోలిస్తే ఇది సుమారు 7 శాతం అధికం కావడం విశేషం. పురుషులు, మహిళల సింగిల్స్ విజేతలు ఒక్కొక్కరికి రూ. 34 కోట్లు ప్రదానం చేయనున్నట్లు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అధికారులు గురువారం ప్రకటించారు. 2024లో విజేతలు అందుకున్న దానితో పోలిస్తే ఇది 11.1శాతం ఎక్కువ.
‘వింబుల్డన్ ప్రైజ్‌మనీని పెంచినందుకు ఎంతో గర్వపడుతున్నాం. గత 10 సంవత్సరాలుగా ఈ టోర్నీ ప్రైజ్‌మనీని పెంచుకుంటూనే వస్తున్నాం. క్రితం ఏడాదితో పోలిస్తే ఈ సారి 7 శాతం ఎక్కువగా పెంచాం.’ అని ఆల్ ఇంగ్లాండ్ చైర్‌పర్సన్ డెబోరా జెవాన్స్ అన్నారు. ఇక సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో ఓడిపోయిన ఆటగాళ్లు సైతం రూ. 76.77 లక్షలు అందుకోనున్నారు. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.
టెన్నిస్ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా భావించే వింబుల్డన్ టోర్నీ ఈనెల 30న ఆరంభం కానుంది. జూలై 13 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇక ఈ సారి లైన్ జడ్జిలకు బదులుగా ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈ టోర్నీ చరిత్రలోనే ఇలా చేయడం ఇదే తొలిసారి.
డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్ ప్రైజ్‌మనీ వివరాలు..
లండన్‌లోని లార్డ్స్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా జట్లు టెస్టు ఛాంపియన్ షిప్ గద కోసం పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ప్రైజ్‌మనీగా రూ.30.78 కోట్లు లభిస్తాయి. రన్నరప్ జట్టుకు రూ.18.46 కోట్లు అందనున్నాయి.
విజేతకు – 3.6 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.30.78 కోట్లు)
రన్నరప్‌కు – 2.16 మిలియన్ డాలర్లు (రూ.18.46 కోట్లు)
మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు – 1.4 మిలియన్ల డాలర్లు (రూ.12.31 కోట్లు)
నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ కు – 1.2 మిలియన్ల డాలర్లు (రూ.10.26కోట్లు)
ఐదో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ కు – 9,60000 డాలర్లు (రూ.8.78 కోట్లు)
ఆరో స్థానంలో నిలిచిన శ్రీలంకకు – 8,40,000 డాలర్లు (రూ.7.18 కోట్లు)
ఏడో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు -7,20,000 డాలర్లు (రూ.6.15 కోట్లు)
ఎనిమిదో స్థానంలో నిలిచిన వెస్టిండీస్‌కు – 6,00,000 డాలర్లు (రూ.5.13 కోట్లు)
తొమ్మిదో స్థానంలో నిలిచిన పాకిస్తాన్‌కు – 4,80,000 డాలర్లు (రూ.4.10 కోట్లు)