అండర్ 19 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ

అండర్ 19 వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ

Updated On : October 24, 2019 / 12:43 PM IST

ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ 13వ సీజన్ వచ్చేసింది. రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా కెప్టెన్సీలో ట్రోఫీని దక్కించుకున్న భారత్.. మరో సారి టైటిల్ దక్కించుకోవాలనే కసితో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్‌తో పాటు శ్రీలంక, న్యూజిలాండ్ జట్లు బలంగా కనిపిస్తున్నాయి. 

ఈ టోర్నమెంట్‌కు ఇటీవలే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ తొలి మ్యాచ్‌ను ఆతిథ్య దక్షిణాఫ్రికాతో పర్యాటక జట్టు ఆప్ఘనిస్థాన్‌ జనవరి 17న ఆడనుంది. గతేడాది జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ న్యూజిలాండ్‌లో జరగగా, ఈ సారి దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్నారు. టోర్నీ మొదలైన రెండ్రోజులకు భారత్ తొలి మ్యాచ్‌ను శ్రీలంకతో జనవరి 19న ఆడనుంది. ఆ తర్వాత జనవరి 21న జపాన్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే భారత జట్టు నాలుగు సార్లు అండర్-19 వరల్డ్‌కప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 9న ఫైనల్ మ్యాచ్ ఆడుతుండగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో పాటు భారత గ్రూప్-ఏలో ఉంది. ఈ సీజన్ రెండో అర్ధభాగం సూపర్ లీగ్ మాదిరి జరగనుంది. నాలుగు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సూపర్ లీగ్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ లీగ్ తర్వాత ప్లేట్ ఛాంపియన్‌షిప్ తరహాలో జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. 

మొత్తం నాలుగు గ్రూపులు:
గ్రూప్ ఎ: ఇండియా, న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్
గ్రూప్ బి: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, నైజీరియా
గ్రూప్ సి: పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే, స్కాట్లాండ్
గ్రూప్ డి: దక్షిణాఫ్రికా, అఫ్ఘనిస్తాన్, యూఏఈ, కెనడా