Under-19 World Cup : కుర్రాళ్లు పట్టేస్తారా..! నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 ప్రపంచకప్ శుక్రవారం ప్రారంభమైంది.

India vs Bangladesh
Under-19 World Cup 2024 : స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్2023లో రోహిత్ సారథ్యంలో భారత జట్టు ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. అయితే.. అండర్-19 రూపంలో ప్రపంచకప్‌ను ముద్దాడే సువర్ణావకాశం వచ్చింది. దక్షిణాఫ్రికా వేదికగా అండర్-19 ప్రపంచకప్ శుక్రవారం ప్రారంభమైంది. కాగా.. శనివారం భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బ్లూమ్‌ఫోంటైన్‌లోని మంగాంగ్ ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
అండర్-19 ప్రపంచకప్‌లో యువ భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకు ఐదు సార్లు కప్పును ముద్దాడింది. ఆరోసారి గెలుపే లక్ష్యంలో యువ భారత్ బరిలోకి దిగుతోంది. ఉదయ్ సహరన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. యువ భారత్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. ఇటీవల జరిగిన ట్రై సిరీస్‌ను గెలుచుకుంది. తెలంగాణ క్రికెటఱ్ అవనీశ్ ఈ టోర్నీలో సత్తాచాటాలని భావిస్తున్నాడు. ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్, అర్మిన్ కులకర్ణిలు ఫామ్‌లో ఉండడం భారత్‌కు సానుకూలాంశం.
PCB : పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ముసలం? పీసీబీ ఛైర్మన్ పదవికి జకా అష్రఫ్ రాజీనామా..
బంగ్లాదేశ్‌ను తక్కువ అంచనా వేస్తే భంగపాటు తప్పదు. ఇటీవల ఆసియా కప్ అండర్-19 సెమీ ఫైనల్‌లో టీమ్ఇండియాకు బంగ్లాదేశ్ షాకిచ్చిన సంగతిని మరువరాదు. ఈ ప్రపంచకప్‌లో సత్తా చాటి సీనియర్ జట్టు తలుపు తట్టాలని కుర్రాళ్లు తహతహలాడుతున్నారు. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నాం 1.30 గంటలకు ఆరంభం కానున్నాయి. ఇక అండర్-19 ప్రపంచక ప్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం కానుండగా డిజిటల్‌లో డిస్పీ+హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.
ప్రపంచకప్‌కు ప్రకటించిన ఇరు జట్లు ఇవే..
భారత జట్టు : ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమ్య కుమార్ పాండే (వైస్ కెప్టెన్), ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, అర్షిన్ కులకర్ణి, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, సచిన్ దాస్, అరవెల్లి అవ్నీష్ రావు (వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, ఇనేష్ మహాజన్ (వికెట్ కీపర్), ధనుష్ గౌడ, నమన్ తివారీ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని.
బంగ్లాదేశ్ జట్టు : మహ్ఫుజుర్ రహ్మాన్ రబ్బీ (కెప్టెన్), అహ్రార్ అమీన్ (వైస్ కెప్టెన్), ఆషికుర్ రహ్మాన్ షిబ్లీ, ఆదిల్ బీన్ సిద్ధిక్, జీషాన్ ఆలం, చౌదరి మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అష్రాఫుజ్జామాన్ బోరానో, ఆరిఫుల్ ఇస్లాం, షిహాబ్ జేమ్స్, సిద్ధిఖీ, ఉజి రోబల్, షేక్, పర్త్వే బోర్సన్. హసన్ ఎమాన్, మరుఫ్ మృధా.