సెరెనా.. ఇక అంతేనా

తల్లిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి మైదానంలో అంతగా రాణించలేకపోతున్న సెరెనా కథ ముగిసినట్లేనని క్రీడావిశ్లేషకులు చెబుతున్నారు. చరిత్రలో అత్యధిక టైటిళ్లు సాధించాలనుకున్న కల అందని ద్రాక్షలాగే మిగిలిపోతోంది. ఈ అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ లక్ష్యానికి మరోసారి కెనడా అమ్మాయి బియాంకా ఆండ్రిస్కూ దూరం చేసింది.
యూఎస్ ఓపెన్ ఫైనల్లో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాను యువ కెరటం బియాంకా దారుణంగా చిత్తు చేసింది. టీనేజ్ పూర్తి చేసుకున్న బియాంకా సీనియర్ విభాగంలో ఆడి మహిళల సింగిల్స్ తుదిపోరులో 6-3, 7-5 తేడాతో సెరెనాను చిత్తుగా ఓడించింది. కెరీర్‌లో తొలి టైటిల్‌ను అందుకుని విజేతగా నిలిచింది. ఇప్పటివరకు గ్రాండ్ స్లామ్‌లో రెండో రౌండ్ కూడా దాటని బియాంకా టైటిల్‌ను నెగ్గి రికార్డులు తిరగరాసింది.
సింగిల్స్‌లో గ్రాండ్ స్లామ్‌ను అందుకున్న తొలి కెనడా క్రీడాకారిణిగా ఆమె రికార్డుకెక్కింది. 24వ గ్రాండ్‌స్లామ్ అందుకోవాలనుకున్న సెరెనా తుదిపోరులో ప్రత్యర్థి ముందు తలొంచక తప్పలేదు. తొలి సెట్‌లో బియాంకా ఆధిపత్యం ఏకపక్షంగా సాగినా రెండో సెట్‌లో సెరెనా ప్రతిఘటించింది. అయినప్పటికీ గట్టిపోటీని ఎదుర్కొన్న బియాంకానే టైటిల్ విజేతగా నిలిచింది.