Aashirwad Sooryavanshi : ఇదేం ఫ్యామిలీరా అయ్యా.. వైభవ్ సూర్యవంశీనే కాదు అతడి తమ్ముడు కూడా.. 10 ఏళ్లకే సెంచరీ..
Aashirwad Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ అదరగొట్టాడు.
Vaibhav Sooryavanshi 10 year old younger brother aashirwad sooryavanshi slams century
- అన్న బాటలోనే నడుస్తున్న వైభవ్ సూర్యవంశీ తమ్ముడు
- తొలి సెంచరీ చేసిన ఆశీర్వాద్ సూర్యవంశీ
Vaibhav Sooryavanshi : తన విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారి, అందరి మనసులను గెలుచుకుంటున్నాడు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ 2026లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. తాజాగా అతడి తమ్ముడు ఆశీర్వాద్ సూర్యవంశీ (Aashirwad Sooryavanshi) కూడా తన బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకుంటున్నాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌లో జరిగిన ఓ స్థానిక క్రికెట్ మ్యాచ్‌లో అతడు సెంచరీతో చేలరేగాడు. అతడి వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆశీర్వాద్ పేరు కూడా మారుమోగుతోంది.
క్రికెట్ అకాడమీ తాజ్పూర్ తరఫున బరిలోకి దిగిన ఆశీర్వాద్ ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మొత్తం 87 బంతులు ఎదుర్కొన్న అతడు 118కి పైగా స్ట్రైక్‌రేటుతో 103 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఓ సిక్స్ ఉంది. అతడితో పాటు మరో బ్యాటర్ శివమ్ రాజ్ అర్ధశతకం సాధించడంతో తాజ్పూర్ జట్టు భారీ స్కోరు చేసింది.

ఇక సెంచరీ సాధించిన తరువాత ఆశీర్వాద్ తన హెల్మెట్ తీసి సంబురాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే ఒత్తిడిని తట్టుకుని ఆడిన విధానం, బౌలర్లపై చూపించిన ఆధిపత్యం క్రికెట్ విశ్లేషకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతని ఆటతీరు అన్న వైభవ్‌ను గుర్తు చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. అతడు భారత్-ఏ తరుపున ముక్కోణపు సిరీస్‌లో ఆడుతున్నాడు. కాగా.. తమ్ముడు సెంచరీ చేయడంతో వైభవ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పలు ఫోటోలను పంచుకున్నాడు.
