Varun Chakravarthy creates history in England T20I series
టీమ్ఇండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత స్పినర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ప్రస్తుతం వెస్టిండీస్ పేసర్ జాసన్ హోల్డర్ పేరిట ఉంది. 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 15 వికెట్లు తీశాడు.
ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
జాసన్ హోల్డర్ (వెస్టిండీస్) – 15 వికెట్లు – 2022లో ఇంగ్లాండ్ పై
వరుణ్ చక్రవర్తి (భారత్) – 14 వికెట్లు – 2025లో ఇంగ్లాండ్ పై
సమీ సొహైల్ (మలావి) – 14 వికెట్లు – 2019లో మొజాంబిక్ పై
ఇష్ సోధి (న్యూ జిలాండ్) – 13 వికెట్లు – 2021లో ఆస్ట్రేలియా పై
చార్లెస్ హింజ్ (జపాన్) – 13 వికెట్లు – 2024లో మంగోలియా పై
IND vs ENG : కంకషన్ వివాదంపై తొలిసారి స్పందించిన గంభీర్.. దూబె నాలుగు..
ఆ అవార్డు కుటుంబానికే అంకితం..
సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు వరుణ్ చక్రవర్తి సొంతమైంది. ఈ క్రమంలో వరుణ్ మాట్లాడుతూ.. ఫీల్డింగ్‌లోనూ రాణించడం ఆనందంగా ఉందన్నాడు. ఫీల్డింగ్ కోచ్‌తో కలిసి మెరుగు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. బౌలింగ్ పరంగా చూసుకుంటే ఈ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసినట్లుగా వెల్లడించాడు. అయినప్పటికి ఇంకా మెరుగు కావాల్సిన అంశాలు చాలానే ఉన్నాయన్నాడు. వాటిపై ఫోకస్ పెడతానన్నాడు.
ఇక తనకు వచ్చిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును తన భార్య, కుమారుడు, తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లుగా చెప్పాడు. ఇక తనకు మద్దతుగా నిలిచిన కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు.
ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో వరుణ్ ప్రదర్శనలు ఇవే..
తొలి టీ20 లో 3/23 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)
రెండో టీ20 లో 2/38
మూడో టీ20 లో 5/24 (ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్)
నాలుగో టీ20లో 2/28
ఐదో టీ20లో 2/25
ఇక ఐదో టీ20 మ్యాచ్ విషయానికి వస్తే.. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) భారీ శతకంతో చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 150 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది.