కోహ్లీ.. లీగ్‌లో 9వ టాస్ ఓడినా సెలబ్రేషన్ తగ్గలేదు

కోహ్లీని దురదృష్టం వెన్నాడుతుందని చెప్పడానికి టాస్ రిజల్ట్‌లే నిదర్శనం. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభం నుంచి ఆడిన 12 మ్యాచ్‌లలో 9 టాస్‌లు ఓడిపోయాడు. కోహ్లీ కెప్టెన్సీలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అన్ని మ్యాచ్‌లు ఆడింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌కు ముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అంజుమ్ చోప్రాతో మాట్లాడుతున్నాడు. 

ఆ సమయంలో ఓడిపోయిన విషయాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్న కోహ్లీ వెనక్కుతిరిగి తొమ్మిది వేళ్లను చూపిస్తూ సైగ చేశాడు. అయినా ఏ పర్లేదు గెలవగలం అంటూ విజయానికి గుర్తుగా పిడికిలి బిగిస్తూ సైగలు చేశాడు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో వైరల్‌గా మారింది. కోహ్లీ.. నీకు చాలా దరిద్రం వెంటాడుతుంది అంటూ కోహ్లీపై ఓదార్పు కురిపిస్తున్నారు. 

సొంతగడ్డపై టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరంభం నుంచి కట్టడి చేస్తూ వచ్చిన బెంగళూరు 13వ ఓవర్ నుంచి లయ తప్పింది. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్న ఢిల్లీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. 20ఓవర్లు పూర్తయ్యేసరికి 187పరుగులు చేసింది. చేధనలో తడబడ్డ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 171 పరుగులు మాత్రమే చేయడంతో 16 పరుగుల తేడాతో ఓటమికి గురైంది.