పాండ్యా లేకపోవడంతోనే ఈ కష్టాలన్నీ: కోహ్లీ

పాండ్యా లేకపోవడంతోనే ఈ కష్టాలన్నీ: కోహ్లీ

Updated On : June 22, 2021 / 1:04 PM IST

ఆస్ట్రేలియా పర్యటన అనంతరం కివీస్ పర్యటనకు సిద్ధమైన టీమిండియా తొలి వన్డేను నేపియర్ వేదికగా మొదలెట్టేసింది. ఈ మ్యాచ్‌కు జట్టు ఎంపిక విషయం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కష్టమైందట. ఇది కేవలం భారత జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా లేకపోవడం వల్లనే అంటున్నాడు విరాట్. వన్డే జట్టులో ఆల్‌రౌండర్‌కు ప్రాముఖ్యం ఎటువంటిదో నొక్కిచెప్పాడు. యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్య ఉంటే బౌలింగ్‌ విభాగం కూర్పు బాగుంటుందని వెల్లడించాడు.

‘బౌలింగ్ కూర్పు చక్కగా ఉండాలంటే ఆల్‌రౌండర్‌ ఉండటం తప్పనిసరి. అంతర్జాతీయ అత్యుత్తమ జట్లలో ఇద్దరు, ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉంటారు. టీమిండియాలో విజయ్‌ శంకర్‌ లేదా హార్దిక్‌ పాండ్య లేకుంటే ముగ్గురు పేసర్లను ఆడించాల్సి వస్తుంది. ఆల్‌రౌండర్‌ 140 కిలోమీటర్ల వేగంతో ఆరేడు ఓవర్లు వేస్తే మూడో పేసర్‌ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లు సరిపోతారు. హార్దిక్‌ లేకపోవడంతోనే ఆసియా కప్‌లో ముగ్గురు పేసర్లను ఆడించాం. ఆల్‌రౌండర్‌ ఉంటే మూడో పేసర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు’ అని కోహ్లీ అన్నాడు.

‘గెలుపు అనేది ఎప్పుడూ కీలకమే. ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు రాలేదని ఎవరూ నిరాశపడొద్దు. ప్రపంచకప్‌ ముందు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రశాంతమైన వాతావరణం అవసరం. ఈ సిరీస్‌లోనూ కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తాం. భిన్న పరిస్థితులకు వారెలా స్పందిస్తారో చూస్తాం. ప్రపంచకప్‌ లాంటి పెద్ద టోర్నీ ముందు ఆటగాళ్లు అన్ని పరిస్థితుల్లో ఆడేలా ఉండాలి. జట్టుకు సమతూకం చాలా అవసరం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.