Virat Kohli summons former Team India batting coach Sanjay Bangar for help
బీసీసీఐ ఆదేశాలతో టీమ్ఇండియా స్టార్ ఆటగాళ్లంతా దేశవాళీ బాట పట్టారు. ఇప్పటికే రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రంజీ మ్యాచులు ఆడుతున్నారు. ఇక పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ కూడా జనవరి 30 నుంచి రైల్వేస్‌తో జరగనున్న మ్యాచ్‌తో బరిలోకి దిగనున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్న కోహ్లీ.. ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. దాదాపు 12 ఏళ్ల తరువాత అతడు రంజీల్లో ఆడనున్నారు.
గత కొంత కాలంగా కోహ్లీ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆఫ్‌సైడ్ బలహీనతను అధిగమించలేక పదే పదే ఒకే రీతిలో ఔటై పెవిలియన్‌కు చేరుకున్నాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 23.75 సగటుతో 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఓ సెంచరీ ఉంది. ఈ నేపథ్యంలో తన ఫామ్‌ను అందుకునేందుకు టీమ్ ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ను సాయం చేయాల్సిందిగా కోరాడు. అతడి సాయంతో తన బలహీనతను అధిగమించే పనిలో ఉన్నాడు కోహ్లీ.
— V (@CricKeeda18) January 25, 2025
ఆదివారం బంగర్ సమక్షంలో విరాట్ ప్రత్యేక శిక్షణ శిబిరంలో సాధన చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో కోహ్లీ బ్యాక్‌ఫుట్ పై ఆడుతూ కనిపించాడు. సిమెంట్ పిచ్ పై బ్యాక్‌ఫుట్ తో పాటు స్క్వేర్ ఆఫ్ ద వికెట్ షాట్లు ఆడాడు. బంగర్ త్రోలు వేస్తుండగా కోహ్లీ బ్యాటింగ్ సాధన చేశాడు.
కాగా.. గతంలోనూ ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడిన సమయంలో బంగర్ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడినట్లు కోహ్లీ ఓ సందర్భంలో చెప్పాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించకున్నా..
టీమ్ఇండియా తరుపున బంగర్ 12 టెస్టుల్లో 470 పరుగులు, 15 వన్డేల్లో 180 పరుగులు సాధించాడు. 12 ఐపీఎల్ మ్యాచుల్లో 49 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పెద్దగా రాణించకున్నా కూడా కోచింగ్‌లో మాత్రం ఆకట్టుకుంటున్నాడు.
2014 నుంచి 2019 వరకు టీమ్ఇండియా బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు. 2021 నుంచి 2023 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశాడు. ఈ సమయంలో బంగర్‌తో కోహ్లీకి మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే రంజీల్లో ఆడే ముందు బంగర్ సాయంతో ఫామ్‌లోకి వచ్చేందుకు విరాట్ ప్రయత్నిస్తున్నాడు.
IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు షాక్..
ఇదిలా ఉంటే.. రంజీ ట్రోఫీలో భాగంగా జనవరి 30 నుంచి ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పది వేల మందికి పైగా ప్రేక్షకులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అంచనా వేస్తోంది. అంతేకాదండోయ్.. ఈ మ్యాచ్‌ను ఉచితంగా చూడొచ్చునని తెలిపింది.