IND vs ENG : మ్యాచ్ ఓడిపోయినా.. ఇంగ్లాండ్ కెప్టెన్ వరల్డ్ రికార్డు.. భారత్ అంటే ఇంత ఇష్టమా బట్లర్ మామ నీకు..
రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు.

Jos Buttler world record first player to score 600 t20runs against india
భారత పర్యటనలో ఇంగ్లాండ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ ఓడిపోయింది. చెపాక్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ ఈజీగా గెలిచేటట్లు కనిపించిన ఇంగ్లాండ్ ఆఖరికి రెండు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయినప్పటికి ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో భారత్ పై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
రెండో టీ20 మ్యాచ్‌లో బట్లర్ 30 బంతులను ఎదుర్కొన్నాడు. 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నికోలస్ పూరన్ రికార్డును బ్రేక్ చేశాడు. పూరన్ ఇప్పటి వరకు భారత్ పై 20 టీ20 మ్యాచుల్లో 592 పరుగులు చేశాడు. తాజా మ్యాచులో స్కోరుతో కలిపి బట్లర్ 24 మ్యాచుల్లో 611 పరుగులు సాధించాడు. వీరిద్దరి తరువాతి స్థానాల్లో గ్లెన్ మాక్స్‌వెల్, డేవిడ్ మిల్లర్, ఆరోన్ ఫించ్‌లు ఉన్నారు.
IND vs ENG : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు షాక్..
టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్) – 611 పరుగులు
నికోలస్ పూరన్ (వెస్టిండీస్) – 592 పరుగులు
గ్లెన్ మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) – 574 పరుగులు
డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) – 524 పరుగులు
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) – 500 పరుగులు
మాథ్యూ వేడు (ఆస్ట్రేలియా) – 488 పరుగులు
ధసున్ శనక (శ్రీలంక) – 430 పరుగులు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బట్లర్ రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో బట్లర్ కాకుండా బ్రైడన్ కార్సే (31; 17 బంతుల్లో 1 ఫోర్లు, 3 సిక్సర్లు), జేమీ స్మిత్ (22; 12 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు) లు రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, పాండ్యా, అర్ష్‌దీప్‌లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. తిలక్ వర్మ (72 నాటౌట్; 55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు అసాధారణ విజయాన్ని అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భారత్ 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.