ఒలింపిక్స్ కోసం కారును అమ్మట్లేదు.. దుతి క్లారిటీ!

వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహాలు కోసం తన కారును అమ్మేందుకు సిద్ధమైనట్లు ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన భారత్ స్టార్ మహిళా రన్నర్ దుతి చంద్.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా ప్రకటించారు.
తన శిక్షణకు నిధుల కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కెఐఐటి) మరియు ఒడిశా ప్రభుత్వానికి భారం పడకూడదనే కారణంతో తాను తన BMW కారును విక్రయించాలని అనుకున్నట్లు దుతి చెప్పారు.
వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధం కావడానికి తన కారును విక్రయిస్తున్నట్లు దుతి ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. తరువాత ఆ పోస్ట్‌ను తొలగించినప్పటికి ఏమైంది అనే విషయం తెలియరాలేదు. ఈ క్రమంలో ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
అంతకుముందు దుతి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో ‘ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటిదాకా ఉన్న డబ్బంతా ఖర్చు చేశా. ఇక నా వద్ద డబ్బుల్లేవ్. నా కోచ్, ఫిజియోథెరపిస్టులు, డైటీషియన్‌కు జీతాలు ఇవ్వడానికి నెలకు రూ.5 లక్షలు ఖర్చు అవుతుంది. కరోనా మహమ్మారి కారణంగా స్పాన్సర్లు చేతులెత్తేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తే కష్టకాలంలో ఉన్నట్లు అధికారుల నుంచి జవాబు వచ్చింది. చేసేదేం లేక బీఎండబ్ల్యూను అమ్మకానికి పెట్టా. ఆ కారు మెయింటెనెన్స్ కూడా నాకు భారంగా మారింది’ అని దుతి ఆవేదన వ్యక్తం చేసింది.
2015 ఆసియా క్రీడల్లో పతకం నెగ్గినప్పుడు ఒడిశా ప్రభుత్వం దుతికి రూ. 3 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. అందులో రూ.40లక్షలతో ఈ కారు కొనుగోలు చేసింది. ఇక, దుతి పోస్ట్ వైరల్ అవడంతో ఒడిశా ప్రభుత్వమే సాయం చేయడానికి ముందుకొచ్చింది.