AUS vs AFG : ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ వర్షం వల్ల రద్దైతే.. భారత్‌కు లాభమా, నష్టమా?
అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే భారత్ పరిస్థితి ఏంటంటే?

What Happens If Australia vs Afghanistan Match Gets Washed Out in Champions Trophy 2025
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఓ వైపు మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతుండగా మరోవైపు వరుణుడు తాను ఉన్నానంటూ పలకరిస్తున్నాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో గ్రూప్-బిలో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో నేడు ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య లాహోర్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఇరు జట్లకు ఇది కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-బి నుంచి నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టనుంది. ఈ క్రమంలో సంచలన విజయం సాధించి సెమీస్ చేరుకోవాలని అఫ్గాన్ భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌లో ఘనంగా అడుగుపెట్టాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా జరగనుంది.
అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. అక్యూవెదర్ ప్రకారం.. ఈరోజు (శుక్రవారం) లాహోర్‌లో వర్షం పడే అవకాశం దాదాపు 71 శాతంగా ఉంది. దీంతో మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే.. అప్పడు ఇరు జట్లకు ఒక్కొ పాయింట్ కేటాయిస్తారు.
భారత్‌కు లాభమా, నష్టమా?
వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే అప్పుడు ఆస్ట్రేలియా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా ఖాతాలో మూడు పాయింట్లు ఉండగా అఫ్గాన్ ఖాతాలో రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయితే ఆసీస్ అప్పుడు నాలుగు పాయింట్లతో సెమీస్‌కు దూసుకువెలుతుంది. అదే సమయంలో అఫ్గాన్ ఖాతాలో మూడు పాయింట్ల మాత్రమే ఉండడంతో ఆ జట్టు ఇంటి ముఖం పడుతుంది.
అప్పుడు శనివారం ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే.. గ్రూప్-బి టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెడుతుంది. ఆసీస్ రెండో స్థానంలో నిలుస్తుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. గ్రూప్-ఏ టాపర్‌గా టీమ్ఇండియా సెమీస్‌లో అడుగుపెట్టనుంది. అప్పుడు సెమీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడాల్సి వస్తుంది.
ఐసీసీ టోర్నీల్లో గ్రూప్ దశలో ఆస్ట్రేలియా ప్రదర్శన ఎలాగున్నప్పటికి కూడా కీలకమైన సెమీస్, ఫైనల్ అంటే చాలా ఆసీస్ చెలరేగుతుంది అన్న విషయం తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఓ మోస్తరు ప్రదర్శన చేసిన ఆసీస్ కీలక సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల్లో విశ్వరూపం చూపించింది. కాబట్టి అఫ్గానిస్థాన్‌తో ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దు కావొద్దని.. మ్యాచ్ సజావుగా సాగి అఫ్గానిస్తాన్ గెలవాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.