Champions Trophy 2025 : నక్కతోక తొక్కిన బంగ్లాదేశ్.. కోట్ల వర్షం కురిపించిన వరుణుడు.. కానీ ఇంగ్లాండ్ కనికరిస్తేనే..
ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్‌మనీ లభించనుండగా, పాల్గొన్న అన్ని జట్లకు సైతం క్యాష్ రివార్డు దక్కనుంది.

If England will defeated by South Africa bangladesh gets huge money in Champions Trophy
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఎవరి సంగతి ఎలా ఉన్నా సరే.. బంగ్లాదేశ్ మాత్రం భారీగా లాభపడనుంది. ఈ మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు రెండు మ్యాచ్‌లో ఓడిపోయింది. గురువారం పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ వచ్చి చేరింది. గ్రూప్ -ఏలో ఉన్న బంగ్లాదేశ్ మూడో స్థానంతో రేసును ముగించింది. భారత్‌తో ఓటమి అనంతరం సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన పాకిస్తాన్ కనీసం బంగ్లా పై విజయం సాధించి అభిమానులను శాంతింపజేయాలని అనుకుంది. ఆ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో బంగ్లాదేశ్‌కు భారీగా కలిసి వచ్చింది. ఏకంగా రూ.3.04 కోట్లతో ఆ జట్టు స్వదేశానికి వెళ్లే అవకాశం వచ్చింది. ఒకవేళ మ్యాచ్ జరిగి పాక్ చేతిలో ఓడిపోయి ఉంటే దాదాపు కోటి ఎనభై లక్షలను ఆ జట్టు నష్టపోయేది.
అయినా.. ఇంగ్లాండ్ కరుణించాల్సిందే..
ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్‌మనీగా రూ.19.45 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.9.72 కోట్లు లభించనుంది. ఇక సెమీస్‌లో ఓడిన ఒక్కొ జట్టుకు రూ.4.86 కోట్లు, ఇక ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన జట్లకు ఒక్కొక్కరికి రూ.3.04 కోట్లు, ఏడు, ఎనిమిదో స్థానంలో ఉన్న జట్లు రూ.1.21 కోట్లు దక్కనుంది.
ఈ లెక్కన ప్రస్తుతం గ్రూప్-ఏలో మూడో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్.. టోర్నీ ముగిసే సరికి 8 జట్ల స్థానాలను తీసుకుంటే.. అప్పుడు ఆరో స్థానంలో నిలిస్తే.. అప్పుడు మాత్రమే బంగ్లాదేశ్‌కు రూ.3.04 కోట్లు వస్తాయి. అయితే.. ఇంగ్లాండ్ చేతుల్లోనే బంగ్లాదేశ్ అదృష్టం ఆధారపడి ఉంది.
ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ లు చెరో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌కు చేరగా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ లు ఒక్కొ మ్యాచ్‌లో గెలిచాయి. పాకిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్‌లు మాత్రమే టోర్నీల్లో ఒక్క మ్యాచ్‌ను గెలవలేదు. ఇప్పటికే బంగ్లా, పాక్ లు టోర్నీల్లో తమ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాయి. శనివారం ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలిస్తే అప్పుడు ఇంగ్లాండ్ ఖాతాలో రెండు పాయింట్లు వస్తాయి. అప్పుడు ఆ జట్టు ఐదు లేదా ఆరో స్థానంలో నిలిచే అవకాశం.
అలా కాకుండా ఇంగ్లాండ్ జట్టు గనుక దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోతే అప్పుడు బంగ్లాదేశ్‌కు కలిసి రానుంది. అప్పుడు ఇంగ్లాడ్ ఏడో స్థానంలో పాక్ ఎనిమిదో స్థానంలో నిలుస్తుంది. అఫ్గానిస్తాన్ చివరి మ్యాచ్ ఫలితం బట్టి బంగ్లాదేశ్ ఐదు లేదా ఆరో స్థానంలో నిలుస్తుంది. ఐదు లేదా ఆరు రెండింటిలో ఏ స్థానంలో నిలిచినా కూడా ఐసీసీ నిబంధనల ప్రకారం రూ. 3.04 కోట్లను బంగ్లాదేశ్ ఇంటికి తీసుకువెలుతుంది.
కాబట్టి ఇంగ్లాండ్ తన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలని బంగ్లాదేశ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.