అంబటి రాయుడు రిటైర్ అయిపోతానంటూ బీసీసీఐకు లేఖ రాశాడు. జులై నెలలో ఈ విషయం పెద్ద దుమారం లేపినప్పటికీ బీసీసీఐ వార్తలను ఖండించకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇటీవల అంబటి రాయుడు స్పోర్ట్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని మాటలను వెనక్కి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
‘నేను టీమిండియాకు ఆడనని చెప్పలేదు కదా. జాతీయ జట్టుకు ఎంపిక చేస్తే కచ్చితంగా ఆడతా. రిటైర్మెంట్ ప్రకటించడమనేది ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు. వరల్డ్ కప్ కోసం నాలుగైదేళ్లు చాలా కష్టపడ్డా. ఒక్కసారిగా జట్టులోకి ఎంపిక చేయలేదంటే నిరుత్సాహంగా ఉంటుంది కదా. అయినా జట్టులోకి తీసుకోలేదని నిర్ణయం తీసుకోలేదు. ఈ టైంలో జట్టు నుంచి తప్పుకోవాలనిపించింది. చెప్పేశా. తర్వాత ఆలోచించా మళ్లీ క్రికెట్ ఆడాలనుకుంటున్నా’ అని రాయుడు చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ ఆడే విషయంలో తాను రెడీగానే ఉన్నానని తెలిపాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడూ ప్రోత్సాహకంగానే ఉంటుంది. ఐపీఎల్‌లో సీఎస్కేకు ఆడాలని ప్రిపేర్ అవడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ఐపీఎల్‌లో కచ్చితంగా ఆడతా’ అని రాయుడు ముగించాడు.
టోర్నీ ముగిసిన తర్వాత రాయుడును వరల్డ్ కప్ జట్టులో తీసుకుంటే బాగుండేదని సెలక్టర్లపై చాలా మంది విమర్శలు గుప్పించారు. విజయ్ శంకర్ గాయానికి గురవడంతో మయాంక్ అగర్వాల్ ను జట్టులోకి దింపారు కానీ, అదే స్థానంలో రాయుడు వచ్చినట్లు అయితే ఫలితం మరోలా ఉండేదని కథనాలు వినిపించాయి.