Chennai Super Kings : అదృష్టం అంటే చెన్నైదే.. రాజస్థాన్‌తో మ్యాచ్ ఓడినా.. పాయింట్ల పట్టికలో ఓ స్థానం పైకి.. ఎందుకో తెలుసా?
రాజస్థాన్ తో మ్యాచ్‌లో ఓడినప్పటికి పాయింట్ల పట్టికలో చెన్నై ఓ స్థానాన్ని మెరుగుపరచుకుంది.

pic credit@ ani
ఐపీఎల్‌లో ఆదివారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది.
రాజస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. నితీశ్ రాణా (81; 36 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, రియాన్ పరాగ్ (37; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సంజూ శాంసన్ (20) ఫర్వాలేదనిపించగా.. యశస్వి జైస్వాల్ (4), ధ్రువ్ జురెల్ (3)లు విఫలమయ్యారు. సీఎస్‌కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, మహేశ్ పతిరణ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ సాధించారు.
అనంతరం రుతురాజ్ గైక్వాడ్ (63; 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (32 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించనప్పటికి లక్ష్య ఛేదనలో సీఎస్ కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులకే పరిమితమైంది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (0), విజయ్ శంకర్ (9), శివమ్ దూబె (18), ధోని (16) లు విఫలమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో వనిందు హసరంగ నాలుగు వికెట్లు తీశాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మలు చెరో వికెట్ పడగొట్టారు.
అదృష్టం అంటే చెన్నైదే..
సాధారణంగా ఏదైన జట్టు మ్యాచ్ ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో కిందకి పడిపోతుంటుంది. అయితే.. చెన్నై మాత్రం రాజస్థాన్‌తో మ్యాచ్ ఓడిపోయినప్పటికి కూడా తన స్థానం కిందకి పడిపోలేదు సరికదా తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం విశేషం. ఇందుకు కారణం సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ నెట్‌రన్‌రేట్.
Sailing At The Top ⛵@RCBTweets lead the Points Table after Match 1️⃣1️⃣ of #TATAIPL 2025 👌
How has the start been for your favourite team? ✍ pic.twitter.com/2fvbCunCAY
— IndianPremierLeague (@IPL) March 30, 2025
రాజస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై ఎనిమిదో స్థానంలో ఉండగా రన్‌రేట్ -1.013గా ఉంది. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో కేవలం 6 పరుగులతోనే ఓడిపోవడంతో నెట్‌రన్‌రేట్ -0.771గా మారింది. అంతకముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడిపోయింది. నాలుగు ఓవర్లు మిగిలి ఉండగా ఏడు వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో ఆ జట్టు నెట్‌రన్ రేట్ ఘోరంగా పడిపోయింది. -0.871గా నమోదైంది.
ఈ క్రమంలో ఆర్ఆర్ మ్యాచ్ తరువాత చెన్నై నెట్‌రన్‌రేట్ హైదరాబాద్ కంటే మెరుగ్గా ఉండడంతో ఓ స్థానం ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుంది. అటు రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో గెలిచినా కూడా నెట్‌రన్‌రేట్ -1.112గా ఉండడంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.