Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఈ రేసు నుంచి తప్పుకోగా నాలుగు స్థానాల కోసం ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కూడా ఎంతో కీలకం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానానికి చేరుకోవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎంతో ముఖ్యం. ఈ క్రమంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
కాగా.. ఈ కీలక మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌ను ఓ సమస్య వేధిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో అతడు ఆడతాడా? లేదా? అన్న సందిగ్దం నెలకొంది. ఈ క్రమంలో గిల్ గాయంపై గుజరాత్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి కీలక అప్‌డేట్ ఇచ్చాడు.
మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోలంకి మాట్లాడుతూ.. ‘అవును అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. మేము నిశితంగా అతడిని గమనిస్తున్నాము. అతడు ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడు. నొప్పి ఏ స్థాయిలో ఉందనేది గమనిస్తున్నాము. అతడు బాగానే ఉన్నాడనే నమ్మకం మాకు ఉంది.’ అని అన్నాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే గిల్ వెన్నునొప్పికి గురి అయ్యాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 50 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆ తరువాత వైభవ్ సూర్యవంశీ (101) శతకంతో చెలరేగడంతో రాజస్థాన్ 15.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో వెన్నునొప్పితో గిల్ ఫీల్డింగ్‌కు రాలేదు. అతడి స్థానంలో సీనియర్ ఆటగాడు రషీద్ ఖాన్ స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.