RR vs MI : ముంబై చేతిలో ఓటమి.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ కామెంట్స్ వైరల్.. అందుకనే ఓడిపోయాం..
ముంబై చేతిలో ఓడిపోవడం పై రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ స్పందించాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ కథ ముగిసింది. ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోవడంతో రాజస్థాన్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరువాత ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించిన రెండో జట్టుగా నిలిచింది. గురువారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో 100 పరుగుల తేడాతో రాజస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌కు ఇది ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం.
ముంబై ఇండియన్స్ మ్యాచ్‌తో కలిపి ఈ సీజన్‌లో రాజస్థాన్ 11 మ్యాచ్‌లు ఆడింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ -0.780గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో మరో మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పాయింట్ల పట్టికలో కాస్తమెరుగైన స్థానంతో సీజన్‌ను ముగించాలని రాజస్థాన్ భావిస్తోంది.
ఇక ముంబై చేతిలో ఓడిపోవడం తనను ఎంతో నిరాశకు గురి చేసిందని రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. బ్యాటింగ్ వైఫలమ్యమే తమ కొంపముంచిందన్నాడు. మ్యాచ్ అనంతరం పరాగ్ మాట్లాడుతూ.. ‘ముంబై బ్యాటింగ్ చేసిన తీరుకు మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఓవర్‌కు 10 పరుగుల చొప్పున సాధించారు. ఈ రోజుల్లో 190 నుంచి 200 పరుగుల లక్ష్యం ఛేదించదగినదే. అయితే.. మేము మంచి ఆరంభాలను పొందలేకపోయాం. మిడిల్ ఆర్డర్ లో నేను, ధ్రువ్ ఇంకొంచెం బాధ్యతను తీసుకుని ఆడాల్సి ఉంది.’ అని రియాన్ పరాగ్ అన్నాడు.
ఇక ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించడం పై మాట్లాడుతూ.. ‘ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ కు చేరుకోలేకపోయాం. ఈ సీజన్‌లో కొన్ని మంచి విషయాలు ఉన్నాయి. కొన్ని తప్పులను చేశాము. కొన్ని మ్యాచ్‌ల్లో గెలుపుకు దగ్గరగా వచ్చి ఓడిపోయాం. వాటిని సరిచేసుకోవడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాము. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం.’ అని రియాన్ పరాగ్ తెలిపాడు.