IND vs SL :పేసర్ల విజృంభణ.. 55 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక.. 302 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం..
స్వదేశంలో జరుగుతున్నన వన్డే ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడో మ్యాచులోనూ విజయం సాధించింది.

IND vs SL
India vs Sri Lanka : స్వదేశంలో జరుగుతున్నన వన్డే ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడో మ్యాచులోనూ విజయం సాధించింది. వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. వన్డే ప్రపంచకప్ చరిత్రలో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. శ్రీలంక బ్యాటర్లలో రజిత (14), మాథ్యూస్ (12), తీక్షణ (12), మాత్రమే రెండు అంకెల స్కోర్లు చేశారు. ఐదుగురు బ్యాటర్లు డకౌట్లు అయ్యారు. భారత బౌలర్లలో షమీ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టడు. బుమ్రా, జడేజా చెరో వికెట్ తీశారు.
అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (88 ;94 బంతుల్లో 11 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ (4) విఫలం కాగా.. కేఎల్ రాహుల్ (21), రవీంద్ర జడేజా (35) లు రాణించారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక ఐదు వికెట్లు తీశాడు. చమీర ఓ వికెట్ పడగొట్టాడు.
శతకాలు మిస్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ రెండో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 4 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసిన విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. ఆరంభంలో క్రీజులో కుదురుకునేందుకు వీరు తడబడ్డారు. అదే సమయంలో శ్రీలంక ఫీల్డర్లు క్యాచులు మిస్ చేయడం కూడా వీరికి కలిసి వచ్చింది.
Virat Kohli: సచిన్ తర్వాత కోహ్లినే.. ‘కింగ్’ మరో ఘనత
జీవనధానాలు లభించిన తరువాత ఈ ఇద్దరూ లంక బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సాధికారికంగా బ్యాటింగ్ చేశారు. క్రీజులో కుదురుకున్న తరువాత పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో కోహ్లీ 50 బంతుల్లో గిల్ 55 బంతుల్లో అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 189 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ శతకాలు సాధిస్తారని బావించగా స్వల్ప వ్యవధిలోనే ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు.
అనంతరం వచ్చిన శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేఎల్ రాహుల్, జడేజాతో కలిసి మంచి భాగస్వామ్యాలను నెలకొల్పి జట్టు స్కోరును మూడు వందలు దాటించాడు. సూర్యకుమార్ యాదవ్ (9) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయినా జడేజా ధాటిగా ఆడడంతో స్కోరు 350 దాటింది.