India vs Australia
India vs Australia : వన్డే ప్రపంచకప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో ఈ రెండు జట్లు తలడడం ఇది రెండో సారి. చివరిసారి 20 ఏళ్ల క్రితం భారత్, ఆస్ట్రేలియా జట్లు 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచులో తలపడడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 125 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా.. 2003 ప్రపంచకప్ కు 2023 ప్రపంచకప్‌కు కొన్ని అసాధారణమైన సారూపత్యలు కనిపిస్తున్నాయి.
వరుసగా 10 మ్యాచుల్లో విజయాలు..
2003 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ చేరే క్రమంలో ఆ జట్టు వరుసగా 10 మ్యాచుల్లో గెలుపొందింది. ఇప్పుడు 2023 మెగాటోర్నీలో రోహిత్ నేతృత్వంలోని టీమ్ఇండియా వరుసగా 10 మ్యాచుల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. రెండు జట్లు కూడా పాయింట్ల పట్టికలో మొదటి స్థానాల్లోనే నిలవడం గమనార్హం.
ప్రపంచ కప్ ప్రయాణం..
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన 2003 ప్రపంచకప్‌లో గ్రూపు దశలో ఆడిన మ్యాచులో ఆసీస్ పై భారత్ ఓడిపోయింది. కాగా.. 2023లో గ్రూపు దశలో టీమ్ఇండియా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. అప్పుడు భారత్ ఫైనల్ చేరే క్రమంలో వరుసగా ఎనిమిది మ్యాచుల్లో గెలుపొందగా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడిన సరిగ్గా ఎనిమిది మ్యాచుల్లో గెలిచి ఫైనల్‌కు చేరింది. అప్పుడు, ఇప్పుడు భారత్ ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ మ్యాచులో తలపడ్డాయి.
రెగ్యులర్ వికెట్ కీపర్ కాదు..
2003 వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రవిడ్ వికెట్ కీపర్ పాత్రను పోషించాడు. తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కీపింగ్‌లో రాణించడమే కాకుండా 11 మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు. ఇప్పుడు రెగ్యులర్ కీపర్ రిషబ్ పంత్ గాయపడడంతో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేపట్టాడు. రాహుల్ సైతం వికెట్ల వెనుక మెరుగైన ప్రదర్శన చేయడమే కాకుండా 10 మ్యాచుల్లో 386 పరుగులు చేయడం విశేషం.
KL Rahul – Rahul Dravid
ఇంకా ఆసక్తికరం ఏంటంటే..? 2003లో రాహుల్ ద్రవిడ్ వైస్ కెప్టెన్ కాగా.. ఇప్పుడు హార్ధిక్ పాండ్య దూరం అయిన తరువాత నుంచి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్ రాహుల్ నిర్వర్తిస్తున్నాడు.
పరుగుల వీరుడు భారతీయుడే..
2003లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ నిలిచాడు. ఆ టోర్నీలో సచిన్ 673 పరుగులు చేశాడు. 2023లో ప్రపంచకప్‌లో కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా టీమ్ఇండియా ప్లేయరే కావడం విశేషం. విరాట్ కోహ్లీ 711 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కాగా.. కోహ్లీ ఇంకో మ్యాచ్ ఆడాల్సి కూడా ఉంది.
Virat-Sachin
భారతదేశం vs ఆస్ట్రేలియా ఫైనల్..
2003లో భారత జట్టు ఆడినట్లుగా ఇప్పుడు ఆస్ట్రేలియా ఆడుతుండగా, అప్పుడు రికీ పాంటింగ్ సారధ్యంలోని ఆసీస్ ఆడినట్లుగా ఇప్పుడు రోహిత్ నాయకత్వంలో భారత్ ఆడుతోంది. గొప్ప వేదికపై తమ ఆధిపత్యాలను ప్రదర్శించి ఆసీస్ మూడో సారి టైటిల్‌ను 2003లో గెలుచుకుంది. కాగా.. ఫైనల్ మ్యాచులో భారత్ విజయం సాధిస్తే టీమ్ఇండియాకు ఇది మూడో టైటిల్ కావడం విశేషం.
Also Read : స్కూల్ బుక్‌లో రోహిత్ శర్మ పై పాఠ్యాంశం..!
మూడోసారి ప్రపంచకప్‌ను భారత్ ముద్దాడుతుందా..?
2003, 2023 వన్డే ప్రపంచకప్‌లకు మధ్య ఇన్ని సారూపత్యలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత జట్టు మూడో ప్రపంచకప్‌ను ఖచ్చితంగా గెలుస్తుందని క్రికెట్ అభిమానులు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే.. 2003లో ఆస్ట్రేలియా మాదిరిగానే ప్రస్తుత భారత క్రికెట్ జట్టు తమ ఆధిపత్య ఫామ్‌ను కొనసాగిస్తూ ఛాంపియన్‌గా నిలుస్తుందా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఫలితం మాట ఎలాగున్నా సరే ఇన్ని సారూపత్యలు ఉండడం క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరుస్తోంది.