Aadhaar App : కొత్త స్మార్ట్ఫోన్లలో ‘ఆధార్ యాప్’ ఇక తప్పనిసరి కాదు.. కేంద్రం యూటర్న్.. అసలు రీజన్ ఇదే..!
Aadhaar App : భారత మార్కెట్లో విక్రయించే కొత్త స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాలనే ప్రణాళికను సమీక్షించాక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Aadhaar App
Aadhaar App : స్మార్ట్ ఫోన్ యూజర్లకు బిగ్ గుడ్ న్యూస్.. స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ తప్పనిసరిపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఈ విషయంలో నో చెప్పడంతో ఆధార్ యాప్ తప్పనిసరి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
గతకొన్ని నెలలుగా భారత మార్కెట్లో విక్రయించే స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్‌ను (Aadhaar App mandatory) తప్పనిసరి చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కోరింది. గతంలో ప్రతి ఫోన్లో ఆధార్ యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేయాలని మొబైల్ తయారీదారులకు సూచించింది.
ఇదే అమలైతే.. వినియోగదారులకు అవసరం లేకున్నా వారి ఫోన్లలో ఈ యాప్ డిఫాల్ట్‌గా ఉంటుంది అనమాట. అయితే, ఇప్పుడు అలా జరగలేదు. దేశంలో స్మార్ట్ఫోన్ల విక్రయ విధానాన్ని మార్చివేయాలనే ఈ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకుంది. సమీక్ష అనంతరం ఈ ప్రణాళికతో ముందుకు వెళ్లకూడదని కేంద్రం నిర్ణయించింది.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గతంలో ఈ విషయాన్ని ఐటీ మంత్రిత్వ శాఖకు సూచించింది. కానీ, స్మార్ట్‌ఫోన్ తయారీదారులు పలు భాగస్వాములతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్‌ను తప్పనిసరి చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ సుముఖంగా లేదని తెలుస్తోంది.
అసలు ప్రభుత్వ ప్రతిపాదన ఏంటి? :
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ డివైజ్‌లలో ఆధార్ యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ చేసి విక్రయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. ఇకపై యూజర్లు స్వయంగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, ఎక్కువ మంది భారతీయులకు ఆధార్‌ను ఈజీగా యాక్సస్ చేయొచ్చనని భావించింది. బ్యాంకింగ్, టెలికాం వంటి సేవల్లో ఆధార్ ఇప్పటికే అందుబాటులో ఉంది. వినియోగదారులు ఈ యాప్ కోసం ప్రత్యేకించి వెతకాల్సిన పని ఉండదు.
అందుకే ఫోన్లలోనే ఈజీగా యాక్సస్ చేసేలా యాప్ ప్రీ-ఇన్ స్టాల్ చేయాలని సూచించింది. ఒకవేళ ఈ ప్రపోజల్ అమలైతే ఆపిల్, శాంసంగ్ వంటి స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ ఫోన్లలో ఆధార్ యాప్‌ను తప్పనిసరిగా ప్రీ-ఇన్స్టాల్ చేయాల్సి వచ్చేది. అయితే, ఈ ప్రభుత్వ ప్రతిపాదనను ఇతర ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎందుకు రెడీగా లేవంటే? :
ప్రభుత్వ ప్లానింగ్ విషయంలో స్మార్ట్‌ఫోన్ తయారీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆపిల్, శాంసంగ్ వంటి కంపెనీలు ఖర్చులు పెరిగే అవకాశం సహా పలు ఆందోళనలను వ్యక్తం చేశాయి. చాలా బ్రాండ్లు వేర్వేరు దేశాలలో తయారైన ఒకే రకమైన ఫోన్లను అమ్ముతాయి.
కేవలం భారత్ కోసం డిఫాల్ట్‌గా యాప్‌ను ప్రీ ఇన్ స్టాల్ చేయడం వల్ల కంపెనీలకు అదనపు ఖర్చులు పెరుగుతాయి. స్మార్ట్‌ఫోన్ సేఫ్టీ ప్రైవసీ ఆందోళనలు ఉన్నాయి. ఒక ఫోన్లో డిఫాల్ట్‌గా ఒక యాప్‌ను ఇన్ స్టాల్ చేస్తే భద్రతాపరమైన ప్రమాదాలు లేదా యూజర్లకు టెక్నికల్ సమస్యలు తలెత్తవచ్చని కొన్ని కంపెనీలు భావించాయి. అందుకే ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించాయి.
ఇలాంటి ప్రతిపాదన రావడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఆధార్ యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి. అయితే, ప్రతిసారీ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ ఇలాంటి ఆందోళనలన వ్యక్తం చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. పలుమార్లు చర్చలు, సంప్రదింపుల అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
