రైలు టికెట్లు బుక్‌ చేస్తుంటే మీకూ ఈ సమస్య ఎదురవుతుందా? ఏం జరిగింది? ఏం చేయాలి?

చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో చెప్పారు.

రైలు టికెట్లు బుక్‌ చేస్తుంటే మీకూ ఈ సమస్య ఎదురవుతుందా? ఏం జరిగింది? ఏం చేయాలి?

Updated On : October 25, 2025 / 8:34 PM IST

IRCTC: మీరు ట్రైన్ టికెట్ బుక్ చేద్దామని IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేశారా? కానీ లాగిన్ అవ్వలేకపోయారా? చాలా మందికి తాజాగా ఇదే సమస్య ఎదురైంది. సోషల్ మీడియాలో చాలా మంది ఈ విషయాన్ని చెబుతున్నారు.

సమస్య ఎక్కడ?

డౌన్‌డిటెక్టర్.కామ్ అనే వెబ్‌సైట్ తెలిపిన వివరాల ప్రకారం.. వచ్చిన ఫిర్యాదుల్లో 51% IRCTC యాప్ గురించి, 46% వెబ్‌సైట్ గురించి ఉన్నాయి. ఒకవేళ మీరు యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేయలేకపోతే, దగ్గరలోని రైల్వే కౌంటర్‌కి వెళ్లి టికెట్ తీసుకోవచ్చు.

అలాంటి సమస్య ఏమీ లేదా?

‘ఈటీ వెల్త్ ఆన్‌లైన్’ టీమ్ అక్టోబర్ 25న మధ్యాహ్నం 1.09 గంటలకు IRCTC రైల్ కనెక్ట్ ఆండ్రాయిడ్ యాప్‌ను (వెర్షన్ 4.2.46) 4జీ నెట్‌వర్క్‌లో వాడి చూసింది. తమకు ఎలాంటి సమస్య లేకుండా బాగానే పనిచేసిందని వారు చెప్పారు.

IRCTC ఏం చెబుతోంది?

ఒక కస్టమర్ ఫిర్యాదుకు ఐఆర్సీటీసీ సమాధానం ఇస్తూ.. IRCTC అక్టోబర్ 25 తెల్లవారుజామున 3.08 గంటలకు ఇలా చెప్పింది..

“సర్, మా వెబ్‌సైట్ (https://irctc.co.in/nget/train-search) రైల్‌కనెక్ట్ యాప్ బాగా పనిచేస్తున్నాయి. దయచేసి మీ ఫోన్/కంప్యూటర్ బ్రౌజర్‌లో హిస్టరీ, క్యాష్‌ను క్లియర్ చేసి మళ్లీ ప్రయత్నించండి. ఒకవేళ సమస్య అలాగే ఉంటే, https://equery.irctc.co.in/irctc_equery/login లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీతో లాగిన్ అయి, మీరు చూసిన ఎర్రర్ స్క్రీన్‌షాట్ లేదా చిన్న వీడియోను అప్‌లోడ్ చేసి ఫిర్యాదు చేయండి” అని చెప్పింది.

Also Read: జిల్లాల ఇష్యూస్‌కు ఎండ్‌కార్డ్ పడబోతోందా? ఏపీ రాజధాని అమరావతి ఒక కొత్త జిల్లాగా..

టికెట్ సమస్యలుంటే ఎవరిని సంప్రదించాలి?

ఫిర్యాదు చేయాలంటే: IRCTC eQuery వెబ్‌సైట్ (https://equery.irctc.co.in/) ద్వారా ఫిర్యాదు చేసి, దాని స్టేటస్ తెలుసుకోవచ్చు.

ఈ-టికెట్ రద్దు లేదా TDR (టికెట్ డిపాజిట్ రశీదు) సమస్యలుంటే: etickets@irctc.co.in కు ఈమెయిల్ చేయండి లేదా 14646 (ఇండియాలో మాత్రమే) నంబర్‌కు కాల్ చేయండి. హిందీ, ఇంగ్లిష్, పంజాబీ, బెంగాళీ, అస్సామీ, ఒడియా, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో మీకు వచ్చిన భాషలో మాట్లాడొచ్చు.

విదేశాల్లో ఉన్నవారు: +91-8044647999 / +91-8035734999 నంబర్లకు కాల్ చేయండి.

కస్టమర్లు ఏమంటున్నారు?

చాలా మంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నట్లు సోషల్ మీడియాలో చెప్పారు.

అనురాగ్ రాణా అనే యూజర్ స్పందిస్తూ.. “తత్కాల్ టికెట్లు బుక్ చేసేటప్పుడు సాధారణంగా ఇలాగే అవుతుంది. IRCTC యాప్ స్లో అవుతుంది, కౌంటర్‌లోని వాళ్లు, ఏజెంట్లు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఇది ఎప్పటినుంచో ఉన్న సమస్య” అని అన్నారు.

ప్రదీప్ చౌహాన్ అనే యూజర్ స్పందిస్తూ.. “తత్కాల్ బుకింగ్ మొదలవడానికి ఒక నిమిషం ముందు IRCTC వెబ్‌సైట్ మొత్తం డౌన్ అయిపోయింది. మూడు రోజులుగా నా పరీక్ష కోసం ఏసీ టికెట్ బుక్ చేద్దామని చూస్తున్నా, పండుగలప్పుడు ఎప్పుడూ ఇంతే” అని చెప్పారు.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఓ రిసెర్చ్ సైంటిస్ట్ ట్వీట్ చేస్తూ.. “తత్కాల్ సమయంలో 10.01గంటలకు IRCTC వెబ్‌సైట్ సర్వర్ రీచ్ కాలేదని చూపించింది. 10.09 గంటల వరకు అదే మెసేజ్వచ్చింది. ఆ తర్వాత రీగ్రెట్ అని చూపించింది?” అని తెలిపారు.

అమిత్ అవస్థీ: “తత్కాల్ సమయంలో IRCTC యాప్ ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఈ సమస్యను మీరు చాలా కాలంగా పట్టించుకోవడం లేదు” అని చెప్పారు.