భారత్‌లో రోజువారీ కూలీలకు రూ.7.5 కోట్లు విరాళమిచ్చిన నెట్ ఫ్లిక్స్

ప్రపంచ ఓటీటీ దిగ్గజం స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ కరోనా కష్టాల్లో ముందుకొచ్చింది. భారతదేశంలో కరోనా సంక్షోభంతో అల్లాడిపోతున్న ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోని రోజువారీ కూలీలకు అండగా నిలిచింది. ప్రొడ్యుసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (PGI) రిలీఫ్ ఫండ్‌కు డెయిలీ వేజ్ వర్కర్ల సహాయర్థం రూ.7.5 కోట్లను విరాళంగా ప్రకటించింది.
గతనెలలోనే PGIకి ఈ విరాళాన్ని పంపింది. భారతీయ క్రియేటివ్ కమ్యూనిటీలో పనిచేసే వేలాది మంది రోజువారీ కూలీలకు స్వల్పకాలిక ఉపశమనం అందించేందుకు ఈ విరాళాన్ని ప్రకటించినట్టు నెట్ ఫ్లిక్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
మూవీలు, టీవీలు, వెబ్ ప్రొడక్షన్స్ నిలిచిపోవడంతో అవే ఆధారంగా జీవిస్తున్న రోజువారీ కూలీలపై నేరుగా తీవ్ర ప్రభావం పడింది. నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన విరాళం ఎంతో విలువైనదిగా ప్రొడ్యుసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సిద్ధార్థ్ రాయ్ కౌర్ ప్రశంసించారు.
అంతేకాదు.. భారతదేశంలో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమర్ ప్రొడక్షన్స్ కింద షెడ్యూల్ ప్రకారం పనిచేసే నటీనటులు, ఇతర వర్కర్లకు నాలుగు వారాల వేతనంగా సాయం అందించాలని నిర్ణయించింది. గతనెలలోనే నెట్ ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా క్రియేటివ్ కమ్యూనిటీకి USD 100 మిలియన్ ఫండ్ సాయం చేస్తున్నట్టు ప్రకటించింది.
Also Read | 3000 కిలోమీటర్లు, 52 గంటలు ప్రయాణించిన గర్భిణీ