Oppo Reno 14 5G Review: ఈ ఫోన్ కెమెరా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది… కానీ ఆ ఒక్క లోపం…

ఒప్పో రెనో 14 5G కొనవచ్చా? బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది?

Oppo Reno 14 5G Review: ఈ ఫోన్ కెమెరా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది… కానీ ఆ ఒక్క లోపం…

Oppo Reno 14 5G

Updated On : July 19, 2025 / 7:02 PM IST

Oppo Reno 14 5G Review:ఒప్పో రెనో 14 5G స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి ఇటీవలే ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్‌ను మొదటిసారి చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ప్రీమియంగా ఉంది. కానీ అసలు మ్యాజిక్ దాని కెమెరా యాప్ ఓపెన్ చేసిన తరువాతే తెలిసింది. ఈ ధరలో పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఇవ్వడం నిజంగా ఒక సాహసమే. అయితే, రోజువారీ వాడకంలో దీని పనితీరు ఎలా ఉంది? ముఖ్యంగా ఆ 6,000mAh బ్యాటరీ నిజంగా రోజంతా సాగుతుందా? మరింత తెలుసుకుందాం.

గత ఏడాది వచ్చిన రెనో 13 మోడల్‌లాగే రెనో 14 5G స్మార్ట్‌ఫోన్ ఉందని చెప్పారు. అదే డిస్‌ప్లే, అదే ప్రాసెసర్. కానీ మరింత పరిశీలిస్తే ఈ ఫోన్ కొన్ని విషయాల్లో వేరేగా కనిపిస్తుంది. 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6,000mAh భారీ బ్యాటరీ, మెరుగైన డ్యూరబిలిటీ రేటింగ్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్ ఉంది.

డిజైన్, డిస్‌ప్లే

రెనో 14 5G చేతిలో పట్టుకున్నప్పుడు వెల్వెట్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీనికి తోడు, IP66, IP68,  IP69 రేటింగ్‌లు ఉండటం ఒక పెద్ద ప్లస్. అంటే ఈ ఫోన్ వర్షం, నీటి చినుకులు, ధూళిని సులభంగా తట్టుకుంటుంది.

ఫ్రంట్ సైడ్ 6.59 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉంది. గరిష్ఠంగా 1,200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉండటం వల్ల బయటి ప్రదేశాల్లో వాడటానికి సరిపోతుంది, కానీ ఈ విషయంలో ఇది మార్కెట్‌లోని టాప్ క్లాస్ ఫోన్లతో పోటీ పడలేకపోవచ్చు.

కెమెరా 

ఈ ఫోన్‌లో కెమెరా విభాగం అద్భుతంగా ఉంది. ఒప్పో ఈ సెగ్మెంట్‌లో కొన్ని అద్భుతమైన ఫీచర్లను అందించింది.

3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్

ఈ ధరలో ఒప్పో నుంచి పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ రావడం చాలా అరుదైన విషయం. ఇది కేవలం పేరుకు మాత్రమే కాదు, పనితీరులో కూడా ఆకట్టుకుంటుంది. 7x జూమ్ వరకు చాలా స్పష్టమైన చిత్రాలను అందిస్తుంది.

ప్రధాన సెన్సార్, సెల్ఫీ కెమెరా

50MP మెయిన్ సెన్సార్ పగటి వెలుతురులో డీటెయిల్డ్ ఫొటోలను తీస్తుంది, HDR పనితీరు కూడా చాలా బాగుంది. తక్కువ వెలుతురులో ఫలితాలు ఫ్లాగ్‌షిప్ స్థాయిలో కాకపోయినా, ధరకు తగిన న్యాయం చేస్తాయి. ఇక 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రియులను కచ్చితంగా మెప్పిస్తుంది. ఇది సహజమైన చర్మ రంగులను, అద్భుతమైన పోర్ట్రెయిట్ షాట్‌లను అందిస్తుంది. వీడియో విషయానికొస్తే, ఫ్రంట్, బ్యాక్ రెండు కెమెరాలపై 4K @ 60fps HDR వీడియో సపోర్ట్ ఉండటం యూజర్లను ఆశ్చర్యపరుస్తోంది.

పనితీరు, సాఫ్ట్‌వేర్

గత ఏడాది మోడల్‌లోని మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్‌నే ఈ ఫోన్‌లోనూ ఉపయోగించారు. ఇది రోజువారీ పనులు, మల్టీ టాస్కింగ్, సాధారణ గేమింగ్‌ను సునాయాసంగా నిర్వహిస్తుంది. పనితీరులో ఎలాంటి లోపం లేదు, కానీ కొత్తదనం మాత్రం లేదు.

ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. కానీ బ్లోట్‌వేర్ ఇప్పటికీ ఒక సమస్యే. అయితే, ఒప్పో అందించే AI టూల్స్ (AI Unblur, Reflection Remover వంటివి) ఫొటో ఎడిటింగ్‌ను సులభతరం చేస్తాయి. భారత వేరియంట్‌లో NFC లేకపోవడం 2025లో కొంచెం నిరాశపరిచే అంశం.

బ్యాటరీ లైఫ్

6,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు మరో పెద్ద బలం. కాల్స్, సోషల్ మీడియా, వీడియోలు చూడటం వంటివి చేసినా సులభంగా 6 గంటలకు పైగా స్క్రీన్-ఆన్-టైమ్ వస్తోంది. 80W SUPERVOOC చార్జర్‌తో గంటలోపే ఫోన్ 0 నుంచి 100% వరకు ఛార్జ్ అవుతుంది, ఇది బిజీగా ఉండే రోజుల్లో చాలా ఉపయోగపడుతుంది.

నచ్చినవి (Pros):

అద్భుతమైన 3.5x పెరిస్కోప్ జూమ్ కెమెరా
రోజంతా నిలిచే 6,000mAh భారీ బ్యాటరీ
ప్రీమియం వెల్వెట్ గ్లాస్ డిజైన్, IP69 రేటింగ్
50MP సెల్ఫీ కెమెరా

నచ్చనివి (Cons):

పాత ప్రాసెసర్, పనితీరులో కొత్తదనం లేదు
అనవసరమైన బ్లోట్‌వేర్ (Bloatware)
భారత వేరియంట్‌లో NFC సపోర్ట్ లేదు

ఒప్పో రెనో 14 5G కొనవచ్చా? నా అభిప్రాయం ఏంటంటే?

  • ఎవరు కొనాలి: రూ.35,000–రూ.40,000 బడ్జెట్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తున్న వారు, ముఖ్యంగా అద్భుతమైన కెమెరా (జూమ్‌తో పాటు), రోజంతా నిలిచే బ్యాటరీ, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది నచ్చుతుంది.
  • ఎవరు వదిలేయాలి: మీరు ఇప్పటికే రెనో 13 వాడుతున్నట్లయితే, టెలిఫొటో లెన్స్ మీ ప్రధాన అవసరం కాకపోతే, ఈ అప్‌గ్రేడ్ అవసరం లేదు.