Passport Seva 2.0 : కొత్త పాస్‌పోర్ట్ సేవా 2.0 ప్రారంభం.. అర్హతలేంటి? డాక్యుమెంట్లు.. ఇ-పాస్‌పోర్ట్‌కు ఎలా అప్లయ్ చేయాలి?
Passport Seva 2.0 : కొత్త పాస్ పోర్టు సేవా 2.0 కోసం అప్లయ్ చేయాలంటే కొన్ని అర్హతలు, అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి..

Passport Seva
Passport Seva 2.0 : విదేశాలకు వెళ్లాలని అనుకునేవారికి తప్పనిసరిగా పాస్‌పోర్టు ఉండాలి. అయితే, చాలా మంది తమ పాస్‌పోర్ట్ గురించి పెద్దగా ఆలోచించరు. అది కూడా అప్లయ్ చేసుకునే వరకు. హాలిడేస్ కోసం విదేశాలకు ప్రయాణించినా, విదేశీ కెరీర్ కోసమైనా లేదా ఊహించని సంక్షోభం సమయాల్లో పాస్‌పోర్టు అవసరం పడుతుంది. అలాంటి పాస్‌పోర్టుకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
ఇందుకోసం.. జూన్ 24, 2025న 13వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారతీయ పౌరుల కోసం పాస్‌పోర్ట్ సేవా కార్యక్రమం (PSP) 2.0ను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రవేశపెట్టారు. ఈ-పాస్‌పోర్ట్‌ల జాతీయ స్వీకరణకు సంబంధించి ఆయన ఇ-పాస్‌పోర్టుల అమలు ప్రారంభమవుతోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇ-పాస్‌పోర్ట్ అనేది కాంటాక్ట్‌లెస్ చిప్ ఆధారిత టెక్నాలజీతో పనిచేస్తుంది.
విదేశీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఇమ్మిగ్రేషన్ విధానాలను వేగవంతం చేస్తుంది. (mPassport) పోలీస్ యాప్ పోలీసు ధృవీకరణ సమయాన్ని కేవలం 5 రోజుల నుంచి 7 రోజులకు తగ్గించిందని జైశంకర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా, ఇ-పాస్‌పోర్ట్‌ల సేవ ప్రస్తుతం నాగ్‌పూర్, భువనేశ్వర్, జమ్మూ, పనాజీ, సిమ్లా, రాయ్‌పూర్, అమృత్సర్, జైపూర్, తమిళనాడు, చెన్నై, హైదరాబాద్, సూరత్, రాంచీలలో అందుబాటులో ఉంది. అతి త్వరలో దేశవ్యాప్తంగా ఈ PSP 2.0 సర్వీసు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇంతకీ ఇ-పాస్‌పోర్టు సర్వీసు ఎలా పొందాలి? ఎలా అప్లయ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇ-పాస్‌పోర్ట్ దరఖాస్తు అర్హతలివే :
ఇ-పాస్‌పోర్ట్ కోసం అర్హత ప్రమాణాలు రెగ్యులర్ భారతీయ పాస్‌పోర్ట్‌కు సమానంగా ఉంటాయి. ఇ-పాస్‌పోర్ట్‌ల ప్రక్రియ దశలవారీగా జారీ కానుంది. అయితే, త్వరలో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారిందరికి ఒకే ప్రమాణంగా మారనుంది.
ఇ-పాస్‌పోర్ట్ అప్లయ్ : అవసరమైన డాక్యుమెంట్లు :
ఇ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే ముందు అవసరమైన డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి.
అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, యుటిలిటీ బిల్లు
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం : డేట్ ఆఫ్ బర్త్‌డే సర్టిఫికేట్, ఆధార్, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ మొదలైనవి.
పాస్‌పోర్ట్ మళ్లీ జారీ చేసేందుకు అప్లయ్ చేసుకునే వారు తమ ఒరిజినల్ పాస్‌పోర్ట్, అబ్జర్వేషన్ పేజీ, పాస్‌పోర్ట్ మొదటి, చివరి పేజీ కాపీ, ECR లేదా నాన్-ECR పేజీని సమర్పించాల్సి ఉంటుంది.
ఇ-పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేయాలంటే? :
ఇ-పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసే వారు పాస్‌పోర్ట్ సర్వీసు పోర్టల్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు లేదా బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ కోసం లోకల్ పాస్‌పోర్ట్ సర్వీసు కేంద్రాలు లేదా పోస్టాఫీస్ కేంద్రాలలో అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు.
- పాస్‌పోర్ట్ సర్వీసు ఆన్‌లైన్ పోర్టల్‌ను విజిట్ చేసి మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
- పాస్‌పోర్ట్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ‘Apply for Fresh Passport/Re-issue of Passport’ లింక్‌పై క్లిక్ చేయండి.
- మొదటిసారి అప్లయ్ చేసుకునే వారు ‘Fresh Issuance’ కేటగిరీకి వెళ్లాలి.
- దరఖాస్తుదారు గతంలో ఏ సాధారణ పాస్‌పోర్ట్, డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ లేదా అధికారిక పాస్‌పోర్ట్ కలిగి ఉండకూడదు.
- ఇప్పుడు, అవసరమైన వివరాలను నింపి అప్లికేషన్ Submit చేయండి.
- “View Saved/Submitted Application” కింద “Pay and Schedule Appointment”పై ట్యాప్ చేయాలి.
- తద్వారా అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి. అన్ని PSK, POPSK, PO లోకేషన్లలో అపాయింట్‌మెంట్ బుకింగ్ ఆన్‌లైన్ పేమెంట్ తప్పనిసరి
- మీరు దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ (ARN)/అపాయింట్‌మెంట్ నంబర్ ఉన్న రసీదును ప్రింట్ తీసుకోండి.
- మీ అపాయింట్‌మెంట్ వివరాలతో కూడిన SMS కూడా అందుతుంది.
- ఆ మెసేజ్ పాస్‌పోర్ట్ ఆఫీసులో చూపించాల్సి ఉంటుంది. అందుకే సేవ్ చేసి పెట్టుకోండి.
- పాస్‌పోర్ట్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేశాక ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
- ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు పాస్‌పోర్ట్ కేంద్రం (PSK)/ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (RPO)ను విజిట్ చేయండి.