SpaceX CEO Elon Musk: కాంతి వేగంతో సమానంగా ఇంటర్నెట్ సేవలు – ఎలన్ మస్క్
ఇంటర్నెట్ స్పీడ్ ను కాంతి వేగంతో అందిస్తానంటున్నారు ఎలన్ మస్క్. 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్ అవుతున్న క్రమంలో.. ఈ రంగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకునేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారు.

Elon Musk
SpaceX CEO Elon Musk: ఇంటర్నెట్ స్పీడ్ ను కాంతి వేగంతో అందిస్తానంటున్నారు ఎలన్ మస్క్. 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్ అవుతున్న క్రమంలో.. ఈ రంగంలోనూ తమ ప్రత్యేకతను చాటుకునేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారు. Tesla, SpaceX అధినేత ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ద్వారా శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో స్టార్‌లింక్ తన సేవలను కూడా ప్రారంభించింది.
తాజాగా ఎలన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో కీలక విషయం బయటపెట్టారు. భవిష్యత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఎటువంటి గ్రౌండ్ స్టేషన్లు లేకుండా ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. వీటి సాయంతో సుమారు కాంతి వేగంతో డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుందని ఇంటర్నెట్ సైంటిస్ట్ స్కాట్ మ్యాన్లీతో ట్విటర్‌లో వెల్లడించారు.
స్టార్‌లింక్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో డౌన్‌లింక్ స్టేషన్ల అవసరాన్ని హైలైట్ చేసిన మస్క్, వచ్చే 4 నుంచి 6 నెలల్లో స్టార్‌లింక్ శాటిలైట్లను ప్రయోగిస్తామని చెప్పారు. అలా చేయడం వల్ల ఇంటర్-శాటిలైట్ లేజర్ లింక్‌లను కలిగి ఉంటుందని చెప్పారు. అప్పుడిక స్థానికంగా ఇంటర్నెట్‌కు ఎలాంటి డౌన్‌లింక్ అవసరం లేదని పేర్కొన్నారు. శాటిలైట్‌లో లేజర్ లింక్‌లను వాడడంతో గ్రౌండ్ స్టేషన్ అడ్డంకులను పూర్తిగా తగ్గిస్తాయన్నారు.
సిడ్నీ నుంచి లండన్‌కు డేటా ట్రాన్స్‌ఫర్ 40 శాతం సంప్రదాయక ఇంటర్నెట్ కంటే వేగంగా ఉంటుందని వెల్లడించారు. సెకనకు 3లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి ప్రయాణిస్తుంది. సంప్రదాయక ఆప్టిక్ ఫైబర్ ద్వారా డేటా వినిమయం 2 లక్షల కిమీ/సెకను వేగంతో ప్రయాణిస్తుంది. ఆప్టిక్ ఫైబర్ ద్వారా జరిగే డేటా వినిమయ ప్రక్రియలో అడ్డంకులు ఏర్పడడంతో స్పీడ్ తగ్గిపోతుంది.
స్టార్‌లింక్‌లో వాడే ఇంట్రా లేజర్‌తో డేటా వినిమయాన్ని కాంతి వేగానికి సమానంగా లేదా దగ్గరగా డేటా వినిమయం చేయవచ్చని తెలిపారు. సాధారణంగా ఇంటర్నెట్ స్పీడ్ సదరు నెట్‌వర్క్ లాటెన్సీపై ఆధారపడి పనిచేస్తోంది.
లాటెన్సీ అంటే ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్‌కు డేటాను పంపడానికి తీసుకునే సమయం. శాటిలైట్లు భూమికి దూరంగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ స్పీడ్‌లో జాప్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వీడియో కాల్‌లు, ఆన్‌లైన్ గేమింగ్ వంటి కార్యకలాపాల పనితీరు తక్కువగా ఉంటుంది. ఎలన్ మస్క్ అందించనున్న స్టార్‌లింక్ ఉపగ్రహాలు సాంప్రదాయ ఉపగ్రహాల కంటే భూమికి 60 రెట్లు దగ్గరగా ఉంటాయి. దీంతో లాటెన్సీ అతి తక్కువగా ఉంటుంది.