Blue Aadhaar Card : బాల (బ్లూ) ఆధార్ కార్డు అంటే ఏంటి? ఈ ప్రత్యేకమైన కార్డు ఐదేళ్ల లోపు పిల్లలకు ఎందుకు ముఖ్యమంటే?

Blue Aadhaar Card : బ్లూ ఆధార్ కార్డునే బాల ఆధార్ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలకు ఈ ప్రత్యేకమైన ఆధార్ కార్డును యూఐడీఏఐ జారీ చేస్తుంది. ఈ ప్రత్యేకమైన కార్డు పిల్లలకు ఎందుకు ముఖ్యం అనేది పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Blue Aadhaar Card : బాల (బ్లూ) ఆధార్ కార్డు అంటే ఏంటి? ఈ ప్రత్యేకమైన కార్డు ఐదేళ్ల లోపు పిల్లలకు ఎందుకు ముఖ్యమంటే?

What is Blue Aadhaar card and why it is important

Blue Aadhaar card : ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఆధార్ కార్డు తప్పక ఉండాలి. ఈ ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. ప్రతి భారతీయుడికి 12-అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. ఈ ఆధార్ సంఖ్య జనాభా, బయోమెట్రిక్ డేటాతో లింక్ అయి ఉంటుంది. వ్యక్తి గుర్తింపు, ఉండే నివాసానికి ఇదే అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగపడుతుంది. ఆధార్ ద్వారా అనేక ప్రభుత్వ పథకాలు, సేవలను పొందవచ్చు.

5 ఏళ్లలోపు పిల్లలకు ప్రత్యేక ఆధార్ :
అయితే ఆధార్ పెద్దలకే కాదు.. పిల్లలకు కూడా తప్పనిసరిగా ఉండాలి. 2018లో, యూఐడీఏఐ పిల్లల కోసం బాల్ (బ్లూ) ఆధార్ ప్రవేశపెట్టింది. 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అందించే ప్రత్యేక ఆధార్ కార్డ్‌నే బ్లూ ఆధార్ కార్డు పేరుతో పిలుస్తారు. ఈ బాల ఆధార్ బ్లూ కలర్‌‌లో మాత్రమే ఉంటుంది. అదే.. పెద్దలకు సాధారణ తెల్లని ఆధార్ కార్డు జారీ చేస్తారు. బ్లూ ఆధార్ కార్డ్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్లు, ప్రయోజనాలు ఉన్నాయి, ఈ ప్రయోజనాలను పొందాలంటే తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లతో ఆధార్ రిజిస్టర్ చేసుకోవడం చాలా ముఖ్యం. బ్లూ ఆధార్ కార్డ్‌ ఎందుకు అవసరం, అనేదానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Aadhaar Card Update : 10ఏళ్లలో మీ ఆధార్ వివరాలను అసలు అప్‌డేట్ చేయలేదా? ఈ తేదీవరకే ఉచితం.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

బాల ఆధార్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? :
బాల ఆధార్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లాడి సొంత ఆధార్ కార్డుతో సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. పిల్లల జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్) లేదా పుట్టిన తేదీకి సంబంధించిన ఏదైనా ఇతర రుజువును అందించాలి. తల్లిదండ్రుల సొంత ఆధార్ నంబర్‌ను కూడా అందించాలి. అది పిల్లల ఆధార్ నంబర్‌తో లింక్ చేస్తారు. పిల్లల ఫొటోను కూడా ఆధార్ సెంటర్లో నమోదు చేస్తారు. కానీ, 15ఏళ్ల లోపు వయస్సులో పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు సరిగా ఉండవు. అందుకే, ఈ వయస్సులో బయోమెట్రిక్ డేటా తీసుకోరు. ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ ఉచితంగానే ఉంటుంది. బాల ఆధార్ కార్డ్ 90 రోజులలోపు రిజిస్టర్డ్ అడ్రస్‌కు పంపుతారు.

బాల ఆధార్ కార్డ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి? :
బాల (బ్లూ) ఆధార్ కార్డ్ అనేది పిల్లలు, తల్లిదండ్రులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పిల్లలకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా పనిచేస్తుంది. స్కూళ్లలో చేరడం, పాస్‌పోర్ట్ దరఖాస్తు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వంటి వివిధ ప్రయోజనాల కోసం ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించవచ్చు. మధ్యాహ్న భోజనం, స్కాలర్‌షిప్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్ మొదలైన వివిధ ప్రభుత్వ పథకాలు, సేవల ప్రయోజనాలను పొందేందుకు అనుమతిస్తుంది. పిల్లల ఐడెంటిటీని తల్లిదండ్రుల మధ్య సంబంధాన్ని ధృవీకరించేందుకు సాయపడుతుంది. ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు లేదా వివాదాల సందర్భంలో బాలల అక్రమ రవాణా, బాల కార్మికులు, బాల్య వివాహాలు, ఇతరేతర సందర్భాల్లో పిల్లల ఐడెంటిటీని గుర్తించడంలో ఆధార్ కార్డు సాయపడుతుంది.

బాల ఆధార్ కార్డ్‌ అప్‌డేట్ ఎప్పుడు చేయాలి? :
పిల్లలకి ఐదేళ్ల వయస్సు వచ్చేవరకు మాత్రమే బ్లూ ఆధార్ కార్డ్ చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత, పిల్లాడి ఆధార్ కార్డును బయోమెట్రిక్ డేటాతో అప్‌డేట్ చేయించాలి. అందులో ఫింగర్ ఫ్రింట్స్, ఐరిస్ స్కాన్‌లు వంటివి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో క్యాప్చర్ చేస్తారు. ఎదిగే పిల్లల్లో బయోమెట్రిక్ డేటా సరిగా ఉండదు. అందుకే, పిల్లవాడికి 15 ఏళ్ల వయస్సులో మాత్రమే ఆధార్ కార్డును మళ్లీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అప్‌డేట్ ప్రాసెస్ కూడా ఉచితమే. ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసిన 90 రోజులలోపు రిజిస్టర్డ్ అడ్రస్‌కు బాల ఆధార్ వస్తుంది.

బాల ఆధార్ కార్డ్‌ అప్‌డేట్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరం? :
బ్లూ ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేయడానికి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అవసరం. తల్లిదండ్రులు తమ ఆధార్ కార్డుతో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌ను విజిట్ చేయాలి. పిల్లాడి ఐడెంటిటీ నిర్ధారణ కోసం తమ ఇంటి అడ్రస్ ప్రూఫ్‌గా ఈ కింది డాక్యుమెంట్లలో ఏదైనా సమర్పించాల్సి ఉంటుంది.

  • పాఠశాల గుర్తింపు కార్డు (ఐడీ)
  • జనన ధృవీకరణ పత్రం
  • పాస్‌పోర్ట్
  • రేషన్ కార్డు
  • పాన్ కార్డ్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • ఓటరు గుర్తింపు కార్డు
  • ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర డాక్యుమెంట్

బ్లూ ఆధార్ కార్డ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
బ్లూ ఆధార్ కార్డ్ స్టేటస్ చెక్ చేయడానికి తల్లిదండ్రులు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను విజిట్ చేయొచ్చు. టోల్-ఫ్రీ నంబర్ 1947కు కాల్ చేయవచ్చు. ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా పిల్లల ఆధార్ నంబర్‌ను చూపించాల్సి ఉంటుంది. బాల ఆధార్ రిజిస్ట్రేషన్ సమయంలో లేదా ఆధార్ అప్‌డేట్ సమయంలో ఈ నెంబర్ ఇస్తారు. యూఐడీఏఐ (UIDAI) వెబ్‌సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి e-Aadhaar కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ డిజిటల్ వెర్షన్ (mAadhaar) యాప్‌ నుంచి కూడా బాల ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బ్లూ ఆధార్ కార్డ్ అనేది 5 ఏళ్లు కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన గుర్తింపుగా చెప్పవచ్చు. దీన్నే బాల ఆధార్ కూడా అని పిలుస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బ్లూ ఆధార్ కార్డ్ కోసం వీలైనంత త్వరగా రిజిస్టర్ చేసుకోవడం మంచిది. బాల ఆధార్ వ్యాలిడిటీని నిర్ధారించడానికి క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తుండాలి.

Read Also : EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన.. ఇకపై పుట్టిన తేదీకి రుజువుగా ఆధార్ కార్డు పనికిరాదు.. వ్యాలీడ్ డాక్యుమెంట్లు ఇవే..!