China 10G Network : చైనాలో సూపర్ ఫాస్ట్ 10G నెట్‌వర్క్.. ప్రపంచంలోనే ఫస్ట్ బ్రాడ్‌బ్యాండ్.. జస్ట్ సెకన్లలోనే 2 ఫుల్ మూవీలు డౌన్‌లోడ్ చేయొచ్చు..!
China 10G Network : చైనా ఇంటర్నెట్ ప్రపంచంలో మరో పెద్ద ముందడుగు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం 10G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. 8K మూవీని కేవలం 2 సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

China 10G Network
China 10G Network : ప్రపంచవ్యాప్తంగా ఇంకా 5G నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు.. అలాంటిది డ్రాగన్ దేశమైన చైనా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 10G నెట్‌వర్క్‌నే తీసుకొచ్చింది. ఈ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ 10గిగాబైట్స్ ఫర్ సెకన్స్ వేగంతో పనిచేస్తుంది. చైనా ఈ 10G నెట్‌వర్క్ టెస్టింగ్ దశలోనే అద్భుతాన్ని సృష్టించింది. హువావే, చైనా యునికామ్ హెబీ ప్రావిన్స్‌లోని సునాన్ కౌంటీలో ప్రయోగాత్మకంగా 10G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది.
ప్రస్తుతం 10G నెట్‌వర్క్ వైర్‌లెస్ కాదు.. వైర్డ్ నెట్‌వర్క్ మాత్రమే.. చైనా జరిపిన ప్రయోగ పరీక్షలో 9834mbps డౌన్‌లోడ్ వేగాన్ని చేరుకుంది. అదేవిధంగా, అప్‌లోడ్ స్పీడ్ 1008mbps. అంటే.. ఈ ఫాస్ట్ నెట్‌వర్క్‌లో 8K మూవీని డౌన్‌లోడ్ చేయడానికి కేవలం 2 సెకన్లు మాత్రమే పడుతుంది. రాబోయే భవిష్యత్తులో ఇంటర్నెట్ ఎంత వేగంగా ఉండబోతోందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
ఏ టెక్నాలజీపై పనిచేస్తుందంటే? :
ఈ అత్యాధునిక ఇంటర్నెట్ సర్వీసుకు ఎన్హాన్స్డ్ ఆల్-ఆప్టికల్ నెట్‌వర్క్ F5G-A పేరు పెట్టారు. 50G-PON మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ యాక్సెస్ నెట్‌వర్క్ కోర్ ఆర్కిటెక్చర్‌కు అప్‌గ్రేడ్ చేసినట్టు నివేదిక పేర్కొంది. దాంతో ఇంటర్నెట్ స్పీడ్ గిగాబైట్ల నుంచి 10G వేగానికి పెరిగింది. అదే సమయంలో ఇంటర్నెట్ జాప్యాన్ని కొన్ని మిల్లీసెకన్లకు తగ్గించింది.
ఈ 10G నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులోకి వస్తే.. ప్రతి రంగం మరింత వేగవంతమైన ఇంటర్నెట్ ప్రయోజనాలను అందుకోవచ్చు. ఇంటర్నెట్ జాప్యాన్ని దాదాపు సున్నాకి తగ్గించవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనే తేడా లేకుండా పోతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను సరికొత్తగా తయారు చేయవచ్చు.
వైద్యులు అతి సూక్ష్మమైన శస్త్రచికిత్సలు కూడా చేయొచ్చు. వెబ్‌సైట్‌లు లోడ్ అయ్యేందుకు పట్టే సమయం లేదా ఆన్‌లైన్ వీడియోలు చూసేటప్పుడు లోడ్ అయ్యే సమయం కూడా చాలా వేగంగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ తదితర రంగాల్లో ఎన్నో మార్పులు సంభవించనున్నాయి.