ఆఫీసుల్లో వారానికి ఐదారు రోజుల పని ఉండదు.. మూడు రోజులే.. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు..

ఉద్యోగులకు కృత్రిమ మేధస్సు టూల్స్‌ ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఈ-మెయిల్‌ల వంటి చిన్న పనుల నుంచి కోడింగ్ వంటి క్లిష్ట పనుల వరకు అవి చేస్తున్నాయి.

ఆఫీసుల్లో వారానికి ఐదారు రోజుల పని ఉండదు.. మూడు రోజులే.. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు..

Jobs

Updated On : September 16, 2025 / 5:01 PM IST

Zoom CEO: కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పనివిధానాన్ని ఎలా మార్చుతుందన్నదానిపై పలువురు పారిశ్రామికవేత్తలు, టెక్‌ దిగ్గజాలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అంత్రాపిక్ సీఈఓ డారియో అమోడి టెల్లకాలర్ ఉద్యోగాలపై ఏఐ వల్ల తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతుండగా, గూగుల్ డీప్‌మైండ్ లీడర్ డెమిస్ హసాబిస్ ఈ టెక్నాలజీ సువర్ణయుగాన్ని తెస్తుందని నమ్ముతున్నారు. (Jobs)

అయితే, మనిషి చేస్తున్న పనులను ఏఐ చాట్‌బాట్లు, ఆటోమేటెడ్ అసిస్టెంట్లు కూడా చేస్తుండడంతో భవిష్యత్తులో తక్కువ పనిదినాలు ఉంటాయని భావిస్తున్న ప్రపంచ దిగ్గజ టెక్ లీడర్ల సంఖ్య పెరుగుతోంది. జూమ్ సీఈఓ ఎరిక్ యుయాన్ దీనిపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల పని దినాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని చెబుతున్నారు.

“కృత్రిమ మేధస్సు మన జీవితాలను మెరుగుపరుస్తుంటే వారానికి 5 రోజులు పని చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతి సంస్థ వారానికి 3 లేదా 4 రోజుల పనిదినాలను సమర్థిస్తుంది. చివరికి ఈ మార్పు వల్ల ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవడానికి ఖాళీ సమయం బాగా దొరుకుతుంది.” అని యుయాన్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

అమెరికాలో కార్పొరేట్ కల్చర్‌ ద్వారా ఇబ్బందులు పడుతున్న వారికి ఇది శుభవార్త. యూరప్‌లో ఇప్పటికే 4 రోజుల వర్క్ వీక్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నారు.

కొంతమంది ఉద్యోగాలు పోయే ప్రమాదం కూడా ఉందని ఎరిక్ యుయాన్ అన్నారు. “ఎప్పుడైనా సాంకేతిక పరిణామం వస్తే, కొన్ని ఉద్యోగ అవకాశాలు పోతాయి, కానీ కొత్త అవకాశాలు కూడా వస్తాయి.

ఉదాహరణకు ఎంట్రీ లెవెల్ ఇంజనీర్లు కోడింగ్‌ను కృత్రిమ మేధస్సుతో రాయించవచ్చు. కానీ ఆ కోడ్‌ను పర్యవేక్షించాలి. అనేక డిజిటల్ ఏజెంట్లను సృష్టిస్తాం కానీ, ఆ ఏజెంట్లను నిర్వహించడానికి మనుషులు కావాలి” అన్నారు.

యూఎస్‌ పెర్ఫార్మన్స్‌ కోచింగ్ కంపెనీ ఎక్సోస్ దీనిపై అధ్యయనం చేసింది. ఉద్యోగుల పనిదినాన్ని ఒక రోజు తక్కువ తగ్గించడంతో వారి మానసిక అలసట సగానికి తగ్గి, ఉత్పాదకత 24 శాతం పెరిగింది. ఈ ఆటోమేషన్ లాభాల ద్వారా ఉద్యోగులకు దక్కుతున్న తక్కువ పనిదినాలు వారికి మేలు చేస్తాయని పలు కంపెనీల సీఈఓలు అంగీకరిస్తున్నారు. అయినా మొత్తం ఉద్యోగాల సంఖ్య తగ్గవచ్చు.

గేట్స్, హువాంగ్, డైమన్ తక్కువ పనిదినాలపై ఏమన్నారు?
ఉద్యోగులకు కృత్రిమ మేధస్సు టూల్స్‌ ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఈ-మెయిల్‌ల వంటి చిన్న పనులనుంచి కోడింగ్ వంటి క్లిష్ట పనుల వరకు అవి చేస్తున్నాయి. టెక్‌ కంపెనీల బాస్‌లు ఈ లాభాలను ప్రత్యక్షంగా చూస్తున్నారు. వారానికి 5 రోజులు పని చేయాల్సిన అవసరం తగ్గుతుందని చెబుతున్నారు.

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ 1970, 1980 దశకాల్లో టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏమిటంటే.. కృత్రిమ మేధస్సు 10 సంవత్సరాల్లో ఉద్యోగుల అవసరాన్ని చాలా విషయాల్లో తొలగిస్తుంది. ఆ సమయంలో పనిచేసే వారు రోజూ హాజరు కావాల్సిన అవసరం ఉండదు.

ఎన్విడియా సీఈఓ హువాంగ్ కూడా తక్కువ పనిదినాలకు మద్దతు ఇస్తున్నారు కానీ, ఒక కండీషన్ పెడుతున్నారు. మనం ఇప్పుడే కృత్రిమ మేధస్సు విప్లవం ప్రారంభ దశలో ఉన్నామని చెప్పారు. పరిశ్రమలు ఇదే వేగంతో కృత్రిమ మేధస్సును స్వీకరిస్తే, అది బహుశా 4 రోజుల వర్క్ వీక్ తెచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే ఆయన అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో మనం ఇప్పటికంటే ఎక్కువ బిజీగా ఉంటాం.

ఆర్థిక రంగంలో కూడా ఆటోమేషన్ వల్ల మార్పులు వస్తున్నాయి. జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ డైమన్ దీనిపై స్పందిస్తూ.. ఈ సాంకేతికత మెరుగైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్తుందని, అయితే కొంతమంది ఉద్యోగాలను తప్పక భర్తీ చేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఉద్యోగులు వారానికి 3 రోజులు మాత్రమే పనిచేస్తారని అభిప్రాయపడ్డారు.