పదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లు.. పూర్తి వివరాలు ఇవిగో
Telangana Formation Day: ఇదంతా కొత్త రాష్ట్రం వల్లే సాధ్యమైందని ప్రతి తెలంగాణ పౌరుడి నమ్మకం.

Telangana Formation Day
దశాబ్దాల పోరాటం.. ఎందరో వీరుల త్యాగ ఫలం.. ప్రత్యేక ఆకాంక్ష.. స్వరాష్ట్రంపై అభిలాష.. సంస్కృతి, సాహితీ ఉద్యమం.. మేథావుల ఆరాటం.. నిరుద్యోగుల ఆశల సౌధం ప్రత్యేక తెలంగాణ. నాయకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు.. విద్యావేత్తలు.. సాహితీవేత్తలు.. రచయితలు.. మొత్తం సకల జనులు సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ పదేళ్లు పూర్తిచేసుకుంది.
సకల జనుల ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ… ఈ పదేళ్లలో ఏం సాధించింది? నీళ్లు, నిధులు, నియామకాల సాధనే లక్ష్యంగా ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రంలో వచ్చిన మార్పులేంటి? ఇంకా సాధించాల్సినదేంటి?
సకల జనుల ఆకాంక్ష.. ఉద్యమకారుల దశాబ్దాల కల.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటోంది. 2014 జూన్ 2న ఆవిర్భవించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం… ఈ జూన్‌తో ఓ మైలురాయిని చేరుకోబోతోంది. ఇన్నాళ్లు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా కొనసాగిన హైదరాబాద్…. ఇకపై పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజధానిగా మాత్రమే ఉండబోతోంది.
పదేళ్లలో గణనీయమైన మార్పులు
నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించిన తెలంగాణ సమాజం.. పదేళ్లలో గణనీయ మార్పులను.. చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకుంది. స్వరాష్ట్రం కోసం.. స్వపరిపాలన కోసం పరితపించిన తెలంగాణ వాసులు ఈ పదేళ్లలో తమ ఆకాంక్షలు తగ్గట్టుగా నూతన రాష్ట్రాన్ని నిర్మించే మహత్తర కార్యంలో సంపూర్ణంగా సహకరించారు. ముఖ్యంగా తెలంగాణ ఆత్మగౌరవం చాటడంలో ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు.
ఇక తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం… ఈ సారి కొన్ని మౌలిక మార్పులు తీసుకువచ్చేలా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉర్రూతలూగించిన ‘జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ అధికారిక గేయంగా ఎంపిక చేసింది. ఇక రాష్ట్ర చిహ్నాన్ని మార్చాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అంతేకాకుండా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ స్టేట్ అధికారిక అబ్రివేషన్‌గా ఉన్న టీఎస్‌ను టీజీగా మార్చింది.
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్… ఈ సారి దశాబ్ది ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. మరోవైపు దాదాపు తొమ్మిదున్నరేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ కూడా ప్రత్యేకంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చేయాలని నిర్ణయించింది. పార్టీలు, రాజకీయాలు ఎలా ఉన్నా… తెలంగాణ సాధనలో వేలమంది ఉద్యమకారులు… వందలమంది నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు పదేళ్ల ప్రస్థానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఈ పదేళ్లలో రాష్ట్రం అన్నిరకాలుగా అభివృద్ధి చెందిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది. వెనుకబడిన ప్రాంతంగా తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ.. అభివృద్ధిలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రాజెక్టులు.. వ్యవసాయం, విద్యుత్, పరిశ్రమలతో అగ్రగామి రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సంక్షేమంలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా పనిచేస్తున్నాయి.
పదేళ్లలో కొత్త చరిత్ర
పదేళ్లలో వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి కొత్త చరిత్రకు నాంది పలికింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టం. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ప్రాజెక్టులో ఇటీవల కొన్ని సమస్యలు తలెత్తినా… తెలంగాణలో నీటి సమస్య తీర్చడంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఘనమైన చరిత్రగానే చెప్పొచ్చు. హైదరాబాద్ నగరానికి మంచినీటి సరఫరాలో కాళేశ్వరం ప్రాజెక్టే కీలకంగా పనిచేస్తోంది.
కొత్త రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలంగాణ దేశానికి కొత్త రైస్ బౌల్‌గా మారింది. పదేళ్లలో వ్యవసాయోత్పత్తి నాలుగు రెట్లు పెరిగింది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు 28.18 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తే.. ఇప్పుడు ఏకంగా 63 లక్షల 53 వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి.
అంటే అదనంగా 32 లక్షల ఎకరాల భూమి సాగు పరిధిలోకి వచ్చింది. ఇదంతా కొత్త రాష్ట్రం వల్లే సాధ్యమైందని ప్రతి తెలంగాణ పౌరుడి నమ్మకం. రికార్డుస్థాయి సాగు విస్తీర్ణంతో దేశంలో అత్యధికంగా వరి సాగుచేసే రాష్ట్రాల్లో మూడోస్థానం దక్కించుకుంది తెలంగాణ.
దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ వ్యవసాయ రంగంలో .. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. సమ్మిళత అభివృద్ధితో ఆదాయం కూడా దండిగా పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఆదాయం కేవలం 51 వేల కోట్ల రూపాయలు అయితే ప్రస్తుతం ఆ ఆదాయం దాదాపు లక్షన్నర కోట్లకు చేరింది.
ఇలా రాష్ట్ర ఆదాయం పెరగడంలో సింహభాగం వాటా పరిశ్రమలదే.. వ్యవసాయ రంగంతో పోటీపడినట్లు ఐటీ పరిశ్రమ తెలంగాణ రాష్ట్రాన్ని తిరుగులేని శక్తిగా మార్చింది. మెరుగైన వసతులతో దేశంలో ఐటీ ఇండస్ట్రీకి గమ్యస్థానంగా మారింది తెలంగాణ. ఇలా అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ.. ఇంతటి అభివృద్ధి ప్రస్థానానికి కారణమైన ఉద్యమ పథం ఇప్పటికీ తెలంగాణ శ్వాసలో కనిపిస్తోంది. అదే చైతన్యం రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేయిస్తోంది.
Also Read: ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్డ్.. తాను ఇకపై చేసే పని ఇదేనంటూ ఆసక్తికర కామెంట్స్