10tv ఎఫెక్ట్ : వెల్ నెస్ సెంటర్లలో మందుల కుంభకోణం, ఉన్నతాధికారుల్లో కదలిక

  • Published By: madhu ,Published On : November 11, 2020 / 02:07 PM IST
10tv ఎఫెక్ట్ : వెల్ నెస్ సెంటర్లలో మందుల కుంభకోణం, ఉన్నతాధికారుల్లో కదలిక

Updated On : November 11, 2020 / 2:44 PM IST

Drug scandal in wellness center : టెన్‌టీవీ ప్రసారం చేసిన హైదరాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్లలో మందుల కుంభకోణంపై ఉన్నతాధికారుల్లో కదలిక మొదలైంది. ఇప్పటికే కాలం చెల్లిన మందులను తరలించిన వెల్‌నెస్ సెంటర్ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి సమాచారం రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గత నాలుగు రోజులుగా డ్రగ్ కంట్రోలర్ అధికారులు ఖైరతాబాద్ వెల్నెస్ సెంటర్‌లో తనిఖీలు చేస్తున్నారు. కాలం చెల్లిన మందులపై అక్కడి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. ఎక్స్‌పైర్‌ అయిపోయిన మెడిసిన్స్ ఉన్నట్టు తన తనిఖీల్లో గుర్తించారు. వాటిని అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.




టెన్‌ టీవీ వరుస కథనాలతో ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను డ్రగ్‌ కంట్రోలర్‌ డైరెక్టర్‌ ప్రీతి మీనన్‌ తనిఖీ చేశారు. వెల్ నెస్ సెంటర్లలో కాలం చెల్లిన మందులు ఉన్నాయని డైరెక్టర్ ఆధారాలు సేకరించారు. వాటిని ఇక్కడి నుంచి తరలించేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. 2018, 2019, 2020 సంవత్సరానికి కాలం చెల్లిన మందులు ఉన్నాయని షాకింగ్‌ విషయాన్ని బయట పెట్టారు ప్రీతి మీనన్.




వెల్‌నెస్ సెంటర్ నుంచి కాలం చెల్లిన మందులను తరలిస్తున్న వ్యవహారం 10tv కెమెరాకు చిక్కింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికారుల అనుమతి లేకుండానే రాత్రి పూట మందులను ఎందుకు తీసుకెళ్తున్నారనే విషయంపై 10tv కూపీ లాగింది. ఆ మందులన్నీ ఇతల జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు చేరాల్సిన మందులుగా తేలింది.
https://10tv.in/drug-control-officer-checking-in-khairatabad-wellness-center/



ఇతర జిల్లాలకు పంపించాల్సిన మందులను కూడా.. ఖైరతాబాద్ వెల్‌నెస్ సెంటర్‌లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి . ఇవే ప్రశ్నలను 10tv లేవనెత్తింది. అంటే ఇతర జిల్లాల్లోని వెల్‌నెస్ సెంటర్లకు వెళ్లే వారికి మందులు ఇవ్వడం లేదా.. ఒక వేళ మందులను బయట తెచ్చుకోవాలని రాసి చేతులు దులుపుకుంటున్నారా.. అనేది తేలాల్సి ఉంది. మందు విషయంలో మాత్రమే కాదు అటు ఉద్యోగుల నియామకాల్లో కూడా అవినీతి జరుగుతోందని 10tv పరిశోధనలో తేలింది.




వెల్‌నెస్ సెంటర్లకు వచ్చే వారి కోసం ప్రభుత్వం అన్ని వసతులు ఏర్పాటు చేసింది. వైద్య సేవల నుంచి నుంచి మందుల వరకు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోంది. ఇక్కడే అక్రమార్కులు తమ చేతివాటం చూపిస్తున్నారు. కాలం చెల్లిన మందులు కొనుగోలు చేస్తూ కొత్త దందాకు తెరలేపారు. తమకు నచ్చిన కంపెనీలు, ఎజెన్సీలతో కుమ్మక్కై ఎక్స్‌పైరీ డేట్‌కి దగ్గర్లో ఉన్న మందులను నామమాత్రం ధరకు కొంటున్నారు.




కానీ.. రెగ్యులర్ రేట్లకే కొంటున్నామంటూ ప్రభుత్వానికి బిల్లులు పెడుతున్నారు. ఆ మందులపై అవగాహన లేని పేషెంట్లకు అంటగడుతూ.. వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలా స్వాహా చేస్తున్న ప్రభుత్వ సొమ్మును వాటాలేసుకుని మరీ పంచుకుంటున్నారు. వెల్‌నెస్ సెంటర్ నుంచి కాలం చెల్లిన మందులను తరలిస్తున్న వ్యవహారం 10tv కెమెరాకు చిక్కింది. దీంతో మందుల మాఫియాపై అటు డ్రగ్ కంట్రోలర్ అధికారులతో పాటు విజిలెన్స్‌ అధికారులు కూడా దృష్టి సారించారు.