పాపం పసివాళ్లు… అప్పుడు అమ్మ.. ఇప్పుడు నాన్న.. ఏడాదిలోనే ఇద్దర్నీ కోల్పోయి..

ఇలా మృతుల కుటుంబాల్లో విషాదం నిండుకుంది.

పాపం పసివాళ్లు… అప్పుడు అమ్మ.. ఇప్పుడు నాన్న.. ఏడాదిలోనే ఇద్దర్నీ కోల్పోయి..

Updated On : February 12, 2025 / 1:08 PM IST

మహా కుంభమేళాకు వెళ్లి ఏడుగురు హైదరాబాద్‌ వాసులు విగతజీవులుగా తిరిగి రావడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిన్న ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

బాలరాజు, సంతోష్‌, శశికాంత్‌, ఆనంద్‌కుమార్‌, మల్లారెడ్డి, రవి, వెంకటప్రసాద్‌ అనే వ్యక్తులు మృతి చెందారు. వారంతా నాచారంలోకి కార్తికేయనగర్, తార్నాక, మూసారాంబాగ్‌కు చెందిన వారు.

నాచారంలోని కార్తికేయనగర్‌కు చెందిన సంతోష్‌ కుమార్‌ ఇంట్లో ఏడాది క్రితమే ఓ విషాదం చోటుచేసుకుంది. గత ఏడాది సంతోష్ భార్య అనారోగ్యంతో మృతి చెందింది. వారి ఇద్దరు పిల్లలు హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. ఇప్పుడు సంతోష్ కూడా మృతి చెందడంతో ఆ ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. సంతోష్ తన పెళ్లిరోజుకు ముందే మృతి చెందాడు. ఇలా ఒక్కొక్కరి కుటుంబలో ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదగాధ.

మరో మృతుడు శశికాంత్‌ది రాఘవేంద్రనగర్‌. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసేవాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలు అంతా చిన్నవారే కావడంతో వారి భవిష్యత్తు ఏంటని బంధువులు కన్నీరుపెట్టుకున్నారు.

మరో మృతుడు వెంకట ప్రసాద్‌ది తార్నాక గోకుల్‌నగర్‌. ఆయన హిమాయత్‌నగర్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగి. ఆయన భార్య, కొడుకు ఉన్నారు.

Also Read: ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మహిళ మృతి.. ఆమె ఫ్యామిలీకి రూ.9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు.. పోరాటంలో గెలిచిన భర్త

మరో మృతుడు మల్లారెడ్డిది కార్తికేయనగర్‌. ఆయన పాలవ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొచ్చేవారు. ఆయన కాలనీ అధ్యక్షుడిగానూ చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఇటవల జరిగిన ఎన్నికల్లో కూడా గెలుపొంది, కుంభమేళా నుంచి వచ్చాక ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు.

మరో మృతుడు ఆనంద్‌కుమార్‌కు 47 ఏళ్లు. ఆయన మూసారాంబాగ్‌లో నివాసం ఉండేవారు. పసిడి నగల దుకాణం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

మరో మృతుడు రాంపల్లి రవి కుమార్‌ది కార్తికేయనగర్‌. ఆయనకు మెడికల్‌ షాప్‌ ఉంది. రవి కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. ఆయన భార్య ఓ టీచర్. ఆయన పిల్లలు ఐటీ ఉద్యోగులు.

ఇక మరో మృతుడు బాలరాజుది ఎర్రకుంట. ఆయన సొంత ప్రాంతం జనగామ జిల్లాలోని ఆర్‌ఆర్‌ బంగ్లా. ఆయన భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. హైదరాబాద్‌లో బాలరాజు అప్పు చేసి టెంపో ట్రావెల్‌ వాహనం కొకున్నాన్నాడు. ఇలా మృతుల కుటుంబాల్లో విషాదం నిండుకుంది. మృతుల్లో చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.