ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మహిళ మృతి.. ఆమె ఫ్యామిలీకి రూ.9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు.. పోరాటంలో గెలిచిన భర్త

ఆ భర్త కోర్టుల్లో సుదీర్ఘంగా పోరాడారు. చివరకు సుప్రీంకోర్టు అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మహిళ మృతి.. ఆమె ఫ్యామిలీకి రూ.9 కోట్లు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు.. పోరాటంలో గెలిచిన భర్త

Supreme Court

Updated On : February 12, 2025 / 12:11 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో 2009, జూన్ 13న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి మొత్తం రూ.9,64,52,220 పరిహారాన్ని చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ డబ్బును ఆ మహిళ కుటుంబానికి ఏపీఎస్ఆర్టీసీ చెల్లించాలని చెప్పింది.

లక్ష్మీ నాగళ్ల అనే మహిళ అప్పట్లో తన ఇద్దరు కూతుళ్లతో కారులో అన్నవరం నుంచి బయలుదేరి రాజమహేంద్రవరానికి వెళ్తున్న సమయంలో వారిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో లక్ష్మీ ప్రాణాలు కోల్పోగా ఆమె భర్త శ్యాంప్రసాద్ కేసు వేశారు.

Also Read: పోలీసులు ఎప్పుడూ లేటుగా వస్తారనుకుంటే తప్పే? కేవలం 6 నిమిషాల్లో అలా వెళ్లి, ఇలా ప్రాణాలు కాపాడారు..

తన భార్య అమెరికాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాస్టర్స్ చేశారని, అంతేగాక, యూఎస్‌ శాశ్వత నివాసిగా ఉన్నారని చెప్పారు. ఆమె అమెరికాలో నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తారని, తన భార్య మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ.9 కోట్ల పరిహారం ఇప్పించాలని చెప్పారు.

సికింద్రాబాద్ మోటార్ యాక్సిడెంట్స్ ట్రైబ్యునల్లో మొదట విచారణ జరిగింది. ఆ ట్రైబ్యునల్ వాదనలు విన్న తర్వాత లక్ష్మీ కుటుంబానికి రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని ఆదేశించింది. 2014లో ట్రైబ్యునల్‌ ఆదేశాలు రాగా, ఈ తీర్పును ఆర్టీసీ సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.

దీంతో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి రూ.5.75 కోట్లు చెల్లించాలని తీర్పును ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును శ్యాంప్రసాద్ సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సుప్రీంకోర్టు లక్ష్మీ కుటుంబానికి రూ.9,64,52,220 చెల్లించాలని ఏపీఎస్ఆర్టీసీని ఆదేశించింది.