AP police: పోలీసులు ఎప్పుడూ లేటుగా వస్తారనుకుంటే తప్పే? కేవలం 6 నిమిషాల్లో అలా వెళ్లి, ఇలా ప్రాణాలు కాపాడారు..
పోలీసులు అంత తక్కువ సమయంలో ప్రాణాలు ఎలా కాపాడారో తెలుసా?

పోలీసులు అంతా అయిపోయాక వస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ, సరైన సమయానికి, సరైన చోటుకి వచ్చి ప్రాణాలు కాపాడతామని చాలా మంది పోలీసులు నిరూపించుకుంటున్నారు.
కోనసీమ, కాకినాడ జిల్లాల పోలీసుల చాకచక్యంగా కేవలం 6 నిమిషాల్లో ఓ మనిషి ప్రాణాలు కాపాడి అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలంలో ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు.
ఇక తాను ఈ బాధలు భరించలేనంటూ బంధువులకు సెల్ఫీ వీడియో పెట్టాడు. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడదామని నిర్ణయం తీసుకున్నాడు. పి.గన్నవరం సీఐ భీమరాజుకు దీనిపై సమాచారం అందిన వెంటనే పోలీసులను అప్రమత్తం చేశారు.
Also Read: మేమున్నామంటూ ఎస్సై సత్యనారాయణమూర్తి ఫ్యామిలీని ఆదుకున్న స్నేహితులు
ఆ యువకుడి ఫోన్ నెంబరును గుర్తించేందుకు ఐటీ కోర్‌లో పనిచేసే జాఫర్ సాయాన్ని తీసుకున్నారు. ఆ యువకుడి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ అతడి సెల్ ఫోన్ ఐడీతో లాస్ట్ లొకేషన్ గుర్తించారు.
కాకినాడ జిల్లా అన్నవరం లొకేషన్ రావడంతో ఆ లొకేషన్‌కు సీఐ భీమరాజు వెళ్లి, అన్నవరం ఎస్సై శ్రీహరికి కూడా ఫోన్ ద్వారా ఈ విషయాన్ని చెప్పారు. ఓ లాడ్జిలో బాధితుడు గది తలుపులు వేసుకున్న ఉరివేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వెంటనే పోలీసులు ఆ లాడ్జీని గుర్తించి అక్కడకు వెళ్లారు.
తలుపులు పగులగొట్టి అతడిని కాపాడారు. గత రాత్రి పోలీసులకు సమాచారం అందిన ఆరు నిమిషాల్లో ఈ పరిణామాలన్నీ జరిగిపోయాయి. అతడిని నిమిషాల వ్యవధిలో కాపడిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.