సర్కార్‌కు సవాల్‌గా మారిన కులగణన సర్వే.. సమాచారం సేకరించేందుకు వెళ్లిన వారిపై జనం గరం!
సర్వే కోసం రూపొందించిన ఫార్మాట్ విషయంలో అభ్యంతరాలు తెలుపుతున్నారు జనాలు. సర్వే ఫామ్‌లో నేరుగా 56 ప్రశ్నలు ఉన్నాయి.

కులగణన అంటూ ప్రభుత్వం.. అయితే అన్ని వివరాలు ఎందుకని ప్రజలు.. ఇలా తెలంగాణ సర్కార్ చేపట్టిన సర్వేకు కష్టాలు తప్పడం లేదు. కులగణన పేరుతో కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలు అడగడంపై పబ్లిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేపై ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే కోసం రూపొందించిన ఫార్మాట్ విషయంలో అభ్యంతరాలు తెలుపుతున్నారు జనాలు. సర్వే ఫామ్‌లో నేరుగా 56 ప్రశ్నలు ఉన్నాయి. సబ్‌గా టైటిల్‌గా ఉన్న ప్రశ్నలు లెక్కిస్తే 70కి పైగా అవుతున్నాయి. ఈ ప్రశ్నల్లో చాలావరకు వ్యక్తిగత సమాచారాన్ని అడగటంపై ప్రజలు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఆస్తులు..ఉద్యోగస్తుల జీతభత్యాలకు సంబంధించిన ప్రశ్నలు ఉండటంపై పబ్లిక్ మండిపడుతున్నారు. అన్ని వివరాలు ఎందుకు ఇవ్వాలంటూ ఎన్యుమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా కాన్ఫిడెన్షియల్‌గా ఉండే ఆస్తులను ఎలా బహిర్గతం చేస్తామంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు, జీతభత్యాల వివరాలను పూర్తిగా చెప్తే ఏమవుతుందో అని భయం వెంటాడుతోంది. మరోవైపు ఈ పూర్తి సమగ్ర సమాచారంతో..ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కోత విధిస్తారేమోనని అనుమానం వ్యక్తమవుతోంది.
వృద్ధాప్య పెన్షన్లు, రేషన్ కార్డులకు అనర్హత విధిస్తారేమోనన్న ఆందోళనలో ఉన్నారు జనం. అందుకే సర్వే విషయంలో ప్రజల నుంచి అంత సానుకూలత వ్యక్తం కావడం లేదనే టాక్ వినిపిస్తోంది. గతంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఉండగానే మళ్లీ కొత్తగా సర్వే చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ కుల సర్వేనే చేయాలనుకుంటే ఈ వ్యక్తిగత ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటి అంటూ నిలదీస్తున్నారు.
సర్కారు పెద్దలు రంగంలోకి
కులగణన పేరుతో చేస్తున్న ఇంటింటి సర్వేపై ప్రజల నుంచి భిన్నమైన వాదన వినిపిస్తుండటంతో సర్కారు పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా రంగంలోకి దిగి సర్వే పట్ల ప్రజలు అనుమానం పడాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
మంత్రి హుస్నాబాద్ పట్టణంలో ఎన్యుమరేటర్స్‌తో కలసి స్వయంగా సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేశారు. ప్రజా ప్రతినిధులు ఇంటింటి కుటుంబ సర్వేలో భాగస్వామ్యులు కావాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. సర్వే ద్వారా మీ కుల బలమెందో తెలిస్తే సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక వేయడానికి అవకాశం ఉంటుందని సర్వేకు సహకరించాలని కోరుతున్నారు. ఈ సమగ్ర సర్వే ద్వారా ఎవరెంతో వారికంత ఆలోచనలతో తేడాలు సరిచేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
ఏదో కహాని ఉందని..
ప్రభుత్వం వివరణ ఎలా ఉన్నా.. ప్రజలు మాత్రం ఎన్యుమరేటర్లకు అన్ని వివరాలు చెప్పడం లేదు. కొందరు అయితే కనీస వివరాలు ఇచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. ఉద్యోగాలు, జీతాలు, అకౌంట్ నెంబర్లు, ఆస్తుల వివరాలు అడగటం వెనక ఏదో కహాని ఉందని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా ఇప్పటికే వస్తున్న పథకాలకు కోత పెట్టే కుట్ర జరుగుతుందంటూ జనం తిట్లదండకం అందుకుంటున్నారు. వ్యక్తిగత ఆస్తులు ఆదాయం వంటి అంశాలను సర్వే నుంచి పక్కన పెట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలను కూడా ప్రజల్లో పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదట. ఎన్యుమరేటర్లు అడిగిన ప్రశ్నలకు ఇష్టమనిపిస్తే సమాధానం చెప్తున్నారట. లేకపోతే లైట్ తీసుకుంటున్నారట. కొందరు అయితే అన్ని వివరాలు ఇస్తున్నారు. ఇదేంటి సర్వే అన్నప్పుడు అందరి దగ్గర అన్ని వివరాలు తీసుకోవాలి కదా. కొందరు వివరాలు ఇవ్వడం లేదు. మరికొందరి దగ్గర అన్ని వివరాలు తీసుకుంటున్నారు ఇదెక్కడ లెక్క అంటూ పబ్లిక్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే కష్టాలను ప్రభుత్వం ఎలా అధిగమిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Chilakaluripet: మళ్లీ పేటకు విడదల రజనీ.. జంపింగ్ బాటలో మర్రి రాజశేఖర్!