Chilakaluripet: మళ్లీ పేటకు విడదల రజనీ.. జంపింగ్ బాటలో మర్రి రాజశేఖర్!
టీడీపీలో అయితే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని అంటున్నారు. సో జనసేనలో చేరితే బాగుంటుంది అన్న చర్చ కూడా ఉందట.

Vidadala Rajini
మాజీమంత్రి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సెగ్మెంట్‌పై గురి పెట్టుకుని ఉన్న ఆ నేత గుర్రు మీదున్నారు. మొదట ఆమె జనసేన వైపు చూశారు. జంప్ అవుతారని మాజీమంత్రిని అధిష్టానం సంతృప్తి పరిచింది. ఆమెకు పెద్దపీట వేస్తున్నారని ఆయన హర్ట్ అయ్యారు. ఇప్పుడు అతడు గ్లాసు పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారు. ఆమె అక్కడ మళ్లీ యాక్టివ్ కావడం ఆయనకు నచ్చడం లేదు. పార్టీ కోసం అన్నీ తానై నిలబడ్డ తనను కాదని.. ఆమెకు టికెట్ ఇచ్చి..అమాత్య యోగం కల్పించారు.
సరే అని ఊరుకున్నా. ఇప్పుడు మళ్లీ ఆమెకు బాధ్యతలు ఇచ్చారు. ఇక నేనేందుకు మరి ఇక్కడ ఉండి అంటూ.. ఆగ్రహంతో ఉన్నారట ఆ లీడర్. మాజీమంత్రి వర్సెస్ ఎమ్మెల్సీ అన్నట్లుగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. మాజీమంత్రి విడదల రజినికి మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. రజిని రీఎంట్రీపై మర్రి రాజశేఖర్ చిర్రెత్తిపోతున్నారట. తన దారి తాను చూసుకునే పనిలో ఉన్నారట. ఇక వైసీపీలో ఉంటే లాభం లేదు. ఎన్నాళ్లు వెయిట్ చేస్తామంటూ అసహనంతో ఉన్నట్లు టాక్.
చిలకలూరిపేటలో వైసీపీకి మొదటి నుంచి మర్రి రాజశేఖర్ కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయన 2004లో ఇండిపెండెంట్‌గా గెలిచి..వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట నడిచిన కాంగ్రెస్ ముఖ్యులలో మర్రి రాజశేఖర్ ఒకరు. ఆయన వైసీపీలో మొదటి నుంచి ఉన్న నేతగా మర్రి రాజశేఖర్‌కి గుర్తింపు ఉంది. ఆయనకు జగన్ 2014లో చిలకలూరిపేట టికెట్ ఇచ్చారు.
రాజశేఖర్ చిలకలూరిపేట టికెట్ ఆశించినా చివరకు..
కానీ ఓటమి పాలయ్యారు. దాంతో టీడీపీ నుంచి వైసీపీలోకి 2019 ఎన్నికల ముందు వచ్చి చేరిన విడదల రజినికి 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. వైసీపీ ప్రభంజనం, బీసీ కార్డుతో రజిని గెలిచారు. ఇక 2024 ఎన్నికల నాటికి రజిని మంత్రి అయినా కూడా నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత రావడంతో ఆమెను గుంటూరు వెస్ట్‌కు పంపించి అక్కడ వైసీపీ నేత కావటి శివ నాగమోహన్ నాయుడుకు టికెట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట టికెట్ ఆశించినా.. అవకాశం లభించలేదు.
ఎన్నికలు అయిపోయాయి. పార్టీ పరాభవం పాలైంది. మాజీమంత్రి విడదల రజిని కూడా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. బాలినేని శ్రీనివాస్ ద్వారా జనసేన కండువా కప్పుకునేందుకు పావులు కదిపారని..పవన్ ఒప్పుకోలేదని టాక్. ఇంతలోనే అలర్ట్ అయిన జగన్ విడదల రజినిని బుజ్జగించారట. ఆమె అడిగినట్లుగా మళ్లీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.
అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్న మర్రి రాజశేఖర్‌కే ఇంచార్జి పదవి ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆయనకు ఇంచార్జ్ ఇస్తే ఇస్తేనే టీడీపీని ఓడించి నెగ్గగలమని అంటున్నారు. మాజీ మంత్రి విడదల రజినికి బాధ్యతలు అప్పగించొద్దని కోరినట్లుగా కూడా ప్రచారం సాగింది. అయితే మూడు రోజుల క్రితం వైసీపీ అధినాయకత్వం విడదల రజినికి చిలకలూరిపేట బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే ఆమె నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ కానున్నారు.
మర్రి రాజశేఖర్ వర్గం గుర్రు
ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ వర్గం గుర్రుగా ఉందట. పార్టీలో ఉంటే ఇక లాభం లేదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. వైసీపీని వీడే సమయం కూడా ఆసన్నం అయినట్లుగా మర్రి వర్గం సంకేతాలు ఇస్తుంది. ఎమ్మెల్సీగా కూడా ఉండడంతో కూటమి కూడా ఆయన రాకను ప్రోత్సహిస్తుంది అని అంటున్నారు. మాజీమంత్రి విడదల రజినితో రాజీపడేది లేదంటున్న మర్రి రాజశేఖర్ వర్గం అంతా కలసి టీడీపీ కానీ జనసేనలో కానీ చేరే చాన్స్ ఉందని అంటున్నారు.
టీడీపీలో అయితే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని అంటున్నారు. సో జనసేనలో చేరితే బాగుంటుంది అన్న చర్చ కూడా ఉందట. రజిని ఎంట్రీతో ఇక వైసీపీ నుంచి మర్రి రాజశేఖర్ విడుదల అవడం ఖాయమంటున్నారు. అయితే మర్రి రాజశేఖర్‌తో వైసీపీ అధినేత జగన్ మాట్లాడారని తెలుస్తోంది. ఆయనకు సర్దిచెప్పాకే విడదల రజినికి ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చారని అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ..మర్రి మాత్రం విడదల రీఎంట్రీని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారట. అయితే మర్రి వైసీపీలోనే వీడుతారా..లేక జనసేనలోకి వెళ్తారా అనే సస్పెన్స్‌కు మరికొన్ని రోజుల్లోనే తెరపడబోతున్నట్లు తెలుస్తోంది.
ఏడాది పాలనపై విజయోత్సవాలకు కాంగ్రెస్ ప్లాన్.. ఓ హామీ అమలు, మరో పథకం గైడ్‌లైన్స్‌పై కసరత్తు?