Madhu Yashki Goud : కాంగ్రెస్ లో చేరేవారి విషయంలో ఆంధ్ర నేతలంటున్నారు.. కేసీఆర్ పార్టీలో లేరా? మధు యాష్కీ గౌడ్
ప్రతిపక్షాలను ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్.. విపక్షాల మీటింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఉన్న కవిత ఎందుకు అరెస్ట్ కాలేదో చెప్పాలన్నారు.

Madhu Yashki Goud
Madhu Yashki Fire KCR : సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో చేరే వారి విషయంలోనే ఎందుకు ఆంధ్ర నాయకులు అంటున్నారు.. కేసీఆర్ పార్టీలో ఆంధ్ర నాయకులు లేరా అని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రాంత నాయకులతో కేసీఆర్ ప్రభుత్వాన్ని నడపడం లేదా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పార్టీ ఆఫీస్ పెడితే ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని.. అందుకే ఇతర పార్టీల నాయకులు పార్టీ వైపు వస్తున్నారని మధుయాష్కీ పేర్కొన్నారు.
ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లోకి వస్తే పార్టీలో ఉన్న వారికి టికెట్ల కోతాయింపులో అన్యాయం జరగకుండా చూడాలన్నారు. షర్మిల అంశం అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపు వచ్చే వారిని తాము స్వాగతిస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సమ న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ అభిమతమని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టింది కేసీఆర్ అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంత నాయకుడైన ఆర్ కృష్ణయ్యకు జగన్ ఎంపీ పదవి ఇవ్వలేదా అని అన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్.. విపక్షాల మీటింగ్ కు ఎందుకు దూరంగా ఉన్నారని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో ఉన్న కవిత ఎందుకు అరెస్ట్ కాలేదో చెప్పాలన్నారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలకు కేసీఆర్ వెళ్ళడని.. కేసీఆర్.. బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తున్నాడని విమర్శించారు.
బీసీ పేరుతో ఆ వర్గాలను బీజేపీ మోసం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జరగబోయే బీసీ గర్జనకు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఆహ్వానిస్తామని చెప్పారు. ఎల్లుండి (సోమవారం) ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం ఉందన్నారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు టికెట్ల కేటాయింపులో సముచిత స్థానం ఉందని వెల్లడించారు.