చలివాగులో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన రెస్క్యూ హెలికాప్టర్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చలివాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ హెలికాప్టర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం, ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుపట్ల మండలం కుందనపల్లి గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లిన రైతులు అక్కడున్న చలివాగులో చిక్కుకుపోయారు. వ్యవసాయ మోటర్లకు సంబంధించి పంపు సెట్లను రక్షించుకునే క్రమంలో వరద ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మొత్తం 10 రైతులు వరదలో చిక్కుకున్నారు.
వారంతా ఆర్తనాదాలు చేయడంతో సమీపంలో ఉన్నవారంతా కూడా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి సమాచారం ఇచ్చారు. గండ్ర..కేటీఆర్ కు సమాచారం ఇచ్చి రక్షించాలని కోరడతో స్పందించిన కేటీఆర్, ఏవియేషన్ అధికారులు, సీఎస్ సోమేష్ కుమార్ లతో మాట్లాడి రెండు ప్రత్యేక హెలికాప్టర్లను ఏర్పాటు చేశారు.
ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లు సుమారు గంటలోపే ఘటనాస్థలికి చేరుకుని అత్యంత సమయ స్ఫూర్తితో వ్యవహరించారు. చలివాగు మొత్తాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వాగులో చిక్కుకున్న వారు ఎక్కడున్నారనే విషయాన్ని గుర్తించి..వారిని ఎక్కడ ల్యాండ్ చేయాలనే ఒక పక్డబందీ వ్యూహంతో జిల్లా కలెక్టర్, అదనపు ఎస్పీ శ్రీనివాసులు పర్యవేక్షణలో వీరంతా ప్రణాళిక ప్రకారం రైతులను సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు.
చలివాగులో చిక్కుకుపోయి చెట్లపై ఆర్తనాదాలు చేస్తున్న రైతులను ఏరియల్ వ్యూ ద్వారా పైకి లాగి ముగ్గురు..ముగ్గురుు చొప్పున సమీపంలోని పొలాల్లో వారిని ఆర్మీ అధికారులు సురక్షితంగా దించారు. రెండు హెలికాప్టర్లు అత్యంత వేగంగా స్పందించి వారిని ఒడ్డుకు చేర్చడంతో పది మందికి సంబంధించిన కుటుంబాలు అత్యంత ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ తీసుకున్న చొరవ మూలంగా తాము ప్రాణాలతో బయటపడ్డామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి జిల్లాకు సంబంధించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆదేశించడంతో ములుగు, భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసి స్వయంగా పర్యవేక్షించి వారందరితో టచ్ లో ఉండటంతో కథ సుఖాంతం అయింది.