Arrest Tension : కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారులకు అరెస్ట్ భయం

ఫార్ములా ఈ కార్ డీల్ నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వరకు రోజుకో అధికారి పేరు బయటకు వస్తుండటంతో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారోనని అధికారులకు గుబులు పట్టుకుంది.

Arrest Tension : కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారులకు అరెస్ట్ భయం

Arrest Tension

Updated On : April 9, 2024 / 5:11 PM IST

Arrest Tension : గత కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో రోజురోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. నాడు ఓ వెలుగు వెలిగిన అధికారులకు ఇప్పుడు అరెస్ట్ ల భయం పట్టుకుంది. ఫార్ములా ఈ కార్ డీల్ నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వరకు రోజుకో అధికారి పేరు బయటకు వస్తుండటంతో ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారోనని అధికారులకు గుబులు పట్టుకుంది.

గత ప్రభుత్వం తప్పిదాలపై అంశాల వారీగా విచారణ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రజాపాలనతో ప్రజలకు దగ్గరవుతూనే మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో ప్రతి శాఖలో జరిగిన తప్పిదాలను ఫోకస్ చేస్తూ యాక్షన్ లోకి దిగింది. దీంతో గత ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అధికారుల్లో కలవరం మొదలైంది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పిదాలపై అంశాల వారీగా విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించడంతో అధికారులకు అరెస్ట్ భయం పట్టుకుంది.

ప్రతి శాఖలో జరిగిన తప్పిదాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్..
నాడు కేసీఆర్ సర్కార్ లో సుదీర్ఘ కాలం పాటు పని చేసిన అధికారులు పరిపాలనలో అన్నీ తామై చక్రం తిప్పారు. ఈ లిస్టులో సీఎస్ గా పని చేసిన సోమేశ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన అరవింద్, రంజిత్ కుమార్, ట్రాన్స్ కో -జెన్ కో ఎండీ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ చీఫ్ రాధాకిషన్ రావు, స్మితా సబర్వాల్, రవాణశాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఇంకా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ ల పేర్లు ప్రముఖంగా ఉన్నాయి.

అధికారులకు అరెస్ట్ భయం..
వీళ్లందరిపై నాడు పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చాలాసార్లు ఘాటైన విమర్శలు చేశారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే వీళ్లని ఎవరినీ వదిలిపెట్టమని, జైలుకి పంపిస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అన్నట్లుగా రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక నాటి అధికారుల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో వాళ్లలో టెన్షన్ పెరుగుతోంది.

ఫార్ములా ఈ-కార్ డీల్ లో రూ.55 కోట్ల గోల్ మాల్..
ఫార్ములా ఈ కార్ నిర్వహణ డీల్ లో జరిగిన అక్రమాలపై రేవంత్ సర్కార్ విచారణకు ఆదేశించడంతో వ్యవహారం అరవింద్ కుమార్ మెడకు చుట్టుకుంది. ఓఆర్ఆర్ లీజు, భూముల వేలం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో అవినీతిపై గతంలో అరవింద్ కుమార్, రేవంత్ రెడ్డి కోర్టు వరకు వెళ్లారు. ఇక ఫార్ములా ఈ కార్ డీల్ లో రూ.55 కోట్ల గోల్ మాల్ లో అరవింద్ అడ్డంగా దొరకడంతో ఇప్పుడు విచారణ మొదలైంది. రేపో మాపో అరవింద్ కుమార్ అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సోమేశ్ కుమార్ మెడకు చుట్టుకున్న ల్యాండ్ వ్యవహారం..
ఇక సోమేశ్ కుమార్ సీఎస్ గా కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారి. ధరణి గోల్ మాల్ లో నాటి సర్కార్ భూముల కేటాయింపుల్లో సోమేశ్ తన పరిధి దాటి వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రేవంత్ లిస్టులో సోమేశ్ కూడా టాప్ ప్రయారిటీలో ఉన్న అధికారి. ఇబ్రహీంపట్నంలో ల్యాండ్ వ్యవహారం ఇప్పుడు సోమేశ్ కుమార్ మెడకు చుట్టుకుంది. ధరణి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ మొదలైతే లిస్టులో ఫస్ట్ సోమేశ్ కుమార్ ఉంటారనే చర్చ వినిపిస్తోంది.

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోకస్..
కేసీఆర్ సర్కార్ లో ట్రాన్స్ కో జెన్ కో ఎండీ ప్రభాకర్ రావు ఎంతో కీలకంగా పని చేసిన అధికారి. కేసీఆర్ కు అత్యంత సన్నిహిత అధికారిగా ప్రభాకర్ రావుకు పేరుంది. విద్యుత్ కొనుగోళ్లలో కీలకంగా వ్యవహరించారన్న విమర్శలూ ఉన్నాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ప్రభాకర్ రావు తన ఎండీ పదవికి రాజీనామా చేశారు. అయితే, ప్రస్తుతం విద్యుత్ కొనుగోళ్లు, ఆ శాఖలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమాచారం తీసుకుంటున్న రేవంత్.. ఇది పూర్తి కాగానే ప్రభాకర్ రావుపై యాక్షన్ లోకి దిగే అవకాశం ఉంది.

ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణ పూర్తైతే నాటి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన రజత్ కుమార్ పై కూడా చర్యలు తప్పని పరిస్థితి. ఇక నాడు సీఎంవోలో చక్రం తిప్పిన స్మితా సబర్వాల్ ను ఇప్పటికే లూప్ లైన్ పోస్టుకు పరిమితం చేసింది రేవంత్ సర్కార్.

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో నాడు రేవంత్ లిస్టులో ఉన్న పోలీసు అధికారుల్లో దడ పుడుతోంది. ఇప్పటికే ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, నాటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యారు. అప్పట్లో సైబరాబాద్ కమిషనర్ గా పని చేసిన స్టీఫెన్ రవీంద్ర చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న చర్చ ఉంది. తెరపైకి వస్తున్న కేసులు, విచారణ, అరెస్టులు చూస్తుంటే త్వరలోనే గత సర్కార్ లో కీలకంగా చక్రం తిప్పిన మరింత మంది అధికారులకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది.

 

Also Read : బీజేపీ, బీఆర్ఎస్‌ను కార్నర్‌ చేసేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్

పూర్తి వివరాలు..