భద్రాద్రి సీతారాముల మూలవరుల ఫొటోలకు కాపీ రైట్స్.. ఇక నుంచి విక్రయిస్తే కఠిన చర్యలు
భద్రాచలం సీతారామ చంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం కాపీ రైట్ హక్కులను అధికారికంగా పొందింది.

Bhadrachalam Temple: తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయం ఒకటి. భక్తుల రద్దీతో నిత్యం ఆలయం, పరిసర ప్రాంతాలు శ్రీరామ నామజపంతో మారుమోగుతుంటాయి. అయితే, భద్రాచలం సీతారామ చంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం కాపీ రైట్ హక్కులను అధికారికంగా పొందింది. ఫొటోలు, చిత్రాలు ఉపయోగించి దేశ, విదేశాల్లో దేవస్థానం కీర్తి, ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరించడంతో కాపీ రైట్స్ తీసుకున్నట్లు ఈవో రమాదేవి తెలిపారు.
దేవస్థానం కీర్తి ప్రతిష్ఠలకు భంగం వాటిల్లేలా చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడే ముద్రణదారులు, వ్యాపారులు, వారికి సహకరించే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రామ్ అండ్ రామ్ ట్రేడ్ మార్క్, పేటెంట్, డిజైన్ కాపీరైట్ రిజిస్ట్రేషన్ కన్సల్టెంట్స్ స్పష్టం చేశారు. తమ ఆధీనంలో ఉన్న చిత్రాలు, ఫొటోలను సదరు ముద్రణ సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు జూన్ 20తరువాత విక్రయిస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా.. జైలు శిక్ష తప్పదని స్సష్టం చేశారు.