Bharat Biotech Covaxin
Bharat Biotech Covaxin : అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు దేశాల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి యత్నిస్తున్న భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన 90శాతం పత్రాలు అందజేసింది. జూన్ నాటికి మిగిలిన పత్రాలు సమర్పిస్తామంది. దీంతో త్వరలోనే తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి లభిస్తుందని భారత్ బయోటెక్ ఆశిస్తోంది. ఇప్పటికే 11 దేశాల్లో కోవాగ్జిన్ కు అనుమతి లభిస్తే.. బ్రెజిల్, హంగేరీలో తుది దశలో అనుమతుల ప్రక్రియ ఉంది. అటు కోవాగ్జిన్ తయారీకి విదేశీ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వ్యాక్సిన్ సాంకేతికత బదిలీపై ఏడు దేశాల్లోని 11 కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది భారత్ బయోటెక్.
భారత్ బయోటెక్ హైదరాబాద్ కి చెందిన సంస్థ. అది అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ ను ప్రస్తుతం దేశంలో వినియోగిస్తున్నారు. కోవాగ్జిన్ ను భారత్ వెలుపల మరిన్ని దేశాల్లో అందించేందుకు భారత్ బయోటెక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో కోవాగ్జిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ అవసరమైన పత్రాలు సమర్పించింది.
త్వరలోనే ఇతర దేశాల్లోనూ కోవాగ్జిన్ వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి వస్తుందని భావిస్తున్నామని భారత్ బయోటెక్ తెలిపింది. మరోవైపు, అమెరికాలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు సంప్రదింపులు ప్రారంభించినట్టు భారత్ బయోటెక్ తెలిపింది. ఎఫ్ డీఏతో సంప్రదింపులు తుది దశలో ఉన్నాయని వివరించింది. ఇప్పటికే 11 దేశాల్లో కొవాగ్జిన్ కు అనుమతులు లభించాయని భారత్ బయోటెక్ వెల్లడించింది.