మంచిర్యాల జిల్లాలో కలకలం.. గడపదాటి రావాలంటేనే వణికిపోతున్న జనం.. ఎందుకో తెలుసా..
వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లొద్దని సూచించారు.

Tiger Tension : మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం హడలెత్తిస్తోంది. కాసిపేట మండలం పెద్ద ధర్మారం గ్రామ శివారులో పెద్ద పులి సంచరిస్తోంది. చుట్టు పక్కల గ్రామాల్లో పెద్ద పులి అడుగులు కనిపిస్తున్నాయి. మరోవైపు పంట పొలాల్లో పెద్ద పులి అరుపులు వినిపిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. పెద్ద పులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడప దాటి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
గత ఆదివారం మామిడిగూడ పంచాయతీ గోండు గూడుకు చెందిన చిత్రూ అనే రైతుకు చెందిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. శనివారం తెల్లవారుజామున పెద్ద ధర్మారం గ్రామానికి అతి సమీపంలోని రహదారిపై పులి అడుగులు కనిపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అటవీశాఖ సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లొద్దని సూచించారు. పులిని గుర్తించేందుకు ట్రాకింగ్ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. పులికి ఎలాంటి హాని తల పెట్టకుండా ఉండేందుకు స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు అటవీ శాఖ అధికారులు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల పులుల సంచారం కలకలం రేపుతోంది. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్ద ధర్మారం శివారు ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఆ ప్రాంతానికి పశువుల కాపరులు, రైతులు, ఎవరూ కూడా వెళ్లొద్దని హెచ్చరించారు. పులి సంచారం విషయం తెలియడంతో సమీప గ్రామాల ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోనూ నాలుగైదు రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. పశువులపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా బోధ్, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్ గంగ పరివాహక ప్రాంతంలోనూ పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. అభయారణ్య పరిధి దాటి పెద్ద పులులన్నీ గ్రామాల సమీపంలోకి వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాటిని తిరిగి అడవుల్లోకి తరిమేలా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రధానంగా కాగజ్ నగర్, బెల్లంపల్లి ప్రాంతాల్లో పులులకు ఆహారం కొరత స్పష్టంగా ఉంది. గతంలోనూ పులుల కోసం కొన్ని శాకాహార జంతువులను అటవీశాఖ అధికారులు అక్కడ వదిలిన దాఖలాలు ఉన్నాయి. పులుల సంతతి పెరుగుతోందని భావించారు. కానీ, పులులకు ఆహారం సరిపోవడం లేదన్న వాదన ఉంది. ఆహారం కోసమే పులులు ఈ విధంగా అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ప్రాణహిత నదిని దాటి వస్తున్నాయి.
ఒక డెన్ లో పులుల సంఖ్య ఎక్కువైనప్పుడు అవి కొత్త డెన్ ను ఏర్పాటు చేసుకునే క్రమంలో బోర్డర్ ను తెలంగాణ వైపునకు ఎక్కువగా వస్తున్నాయి. శాశ్వతంగా తమ నివాసం ఏర్పాటు చేసుకునే క్రమంలో పులులు ఇలా గ్రామాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి అనువైన ప్రాంతం అయి ఉంది, సరైన ఆహారం, నీరు, సురక్షిత ప్రాంతం అని పులి ఒకవేళ అనుకుంటే.. అక్కడే ఉండిపోతుంది. ఒక పులి రోజుకు దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్లు సంచరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయా గ్రామాల్లోని రైతులకు, పశువుల కాపరులకు పులులు తరుచుగా కనిపిస్తున్నాయి.
Also Read : 2029లో భూమికి అతి దగ్గరగా రానున్న భారీ గ్రహశకలం.. 1100 అడుగుల ‘అపోఫిస్’తో ముప్పు పొంచి ఉందా?