ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి కొత్త పేరు.. ఎవరీ శ్రీశరణ్? ఎందుకు ఈడీ గాలిస్తోంది?

కవిత అరెస్ట్ సమయంలో జరిపిన సోదాల్లో శ్రీశరణ్ మొబైల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ఫోరెన్సిక్ బృందం కవిత ఫోన్ డేటాను విశ్లేషిస్తోందని ఈడీ వెల్లడించింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తెరపైకి కొత్త పేరు.. ఎవరీ శ్రీశరణ్? ఎందుకు ఈడీ గాలిస్తోంది?

Delhi Liquor Scam : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక అంశాలను తెలిపింది. లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి కొత్త పేరు వచ్చింది. కవిత సమీప బంధువు శ్రీశరణ్ పేరును రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. శ్రీశరణ్ కోసం హైదరాబాద్ లో ఈడీ వేట కొనసాగుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యే అల్లుడి పాత్రపైనా ఈడీ ఫోకస్ చేసింది. ఇంతకీ ఎవరా శ్రీశరణ్? ఎవరా మాజీ ఎమ్మెల్యే అల్లుడు?

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్తగా తెరపైకి వచ్చిన పేరు మేక శ్రీశరణ్. ఈయన పేరుని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది ఈడీ. ఐటీఆర్ రిపోర్టులు, ఫ్యామిలీ వివరాలు, ఫైనాన్షియల్ ఆఫ్ ద ఫ్యామిలీ బిజినెస్.. ఇలాంటి సమాచారం ఏదీ కవిత ఇవ్వడం లేదని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. శ్రీశరణ్ కవితకు సమీప బంధువు అని తెలిసింది. శ్రీశరణ్.. కవిత భర్త అనిల్ సోదరికి స్వయాన అల్లుడు(అనిల్ సోదరి కూతురికి భర్త) అని తెలిసింది. ఆయన కోసమే ఇవాళ హైదరాబాద్ లో అనిల్ సోదరి నివాసంలో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం.

కవిత సమీప బంధువు మేక శ్రీశరణ్ పేరును రిమాండ్ రిపోర్టులో పేర్కొంది ఈడీ. కవిత అరెస్ట్ సమయంలో జరిపిన సోదాల్లో శ్రీశరణ్ మొబైల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ఫోరెన్సిక్ బృందం కవిత ఫోన్ డేటాను విశ్లేషిస్తోందని ఈడీ వెల్లడించింది. శ్రీశరణ్ వ్యాపారం, వృత్తి వివరాలు తెలపాలని కవితను అడిగామని, అయితే శ్రీశరణ్ వివరాలేవీ తనకు తెలియదని కవిత చెప్పారని ఈడీ పేర్కొంది. విచారణకు హాజరుకావాలని శ్రీశరణ్ ను రెండుసార్లు పిలిచామని ఈడీ చెప్పింది. అయితే, ఆయన విచారణకు రాలేదంది. సమీర్ మహేంద్రు, కవిత మధ్య నగదు బదిలీల్లో శ్రీశరణ్ పాత్ర ఉందని ఈడీ అంటోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి కొంత సమాచారం శ్రీశరణ్ దగ్గర ఉందని చెప్పింది.

కవిత, శ్రీశరణ్ కు మధ్య ఉన్న లింకుని, బంధుత్వాన్ని, ఇద్దరి మధ్య జరిగిన లావాదేవీలను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో ఈడీ ఉంది. అందులో భాగంగానే శ్రీశరణ్ కు సన్నిహితంగా ఉన్న ఒక మాజీ ఎమ్మెల్యే అల్లుడికి సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తోంది. అతడి ప్రేమయం కూడా ఉండి ఉండొచ్చని ఈడీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన వివరాలు తెలుసుకునే పనిలో ఈడీ ఉన్నట్లు సమాచారం. తొలుత శ్రీశరణ్ ని అదుపులోకి తీసుకుని కవితతో కలిపి విచారించాలని ఈడీ భావిస్తోంది.

మొదటి నుంచి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇండో స్పిరిట్స్ కంపెనీ చాలా కీలకంగా ఉంది. ఇండో స్పిరిట్స్ పేరుతోనే ఢిల్లీలో లిక్కర్ వ్యాపారానికి దిగింది. 800కు పైగా షాపులను ఇండో స్పిరిట్స్ తీసుకుంది. ఇందులోనే మాగుంట శ్రీనివాసులు, కవిత, సమీర్ మహేంద్ర భాగస్వాములు. దాని ద్వారానే లబ్ది చేకూరినట్లు ఈడీ ఆరోపణలు చేస్తోంది. దీని నుంచి వచ్చిన నిధులకు సంబంధించి శ్రీశరణ్ ఆ నిధుల లావాదేవీలకు సంబంధించి చాలా కీలకంగా పని చేశారు, ఆ నిధుల బదిలీ, వాడకంలో శ్రీశరణ్ పాత్ర ఉందని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీశరణ్ ను అదుపులోకి తీసుకుని విచారించాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం.

Also Read : ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు