Pravalika Case : ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్.. కోర్టులో లొంగిపోయిన నిందితుడు
నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు శివరాం రాథోడ్. అందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. Pravalika Case

Pravalika Case Update
Group 2 Student Pravalika Death Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. నేను లొంగిపోతున్నా అంటూ నాంపల్లి కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు శివరాం రాథోడ్. అందుకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో నాంపల్లి 9 మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు శివరాం రాథోడ్.
ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయ దుమారం..
ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రవళిక లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది. అక్టోబర్ 13న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు.
వ్యక్తిగత కారణాలే కారణం అని తేల్చిన పోలీసులు..
కాగా, పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు, ప్రేమ వ్యవహారం కారణం అని తేల్చారు. బాయ్ ఫ్రెండ్ శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ ఘటనలో శివరాంపై కేసు నమోదు చేశారు.
ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు సేకరించారు. శివరాం అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవళిక కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
ప్రభుత్వం నిర్వాకం వల్లే అని రాజకీయ పార్టీల ఆందోళనలు..
కాగా, ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాయి.
Also Read : ఆ 2 నిమిషాల ఎంజాయ్‌కి బదులు అమ్మాయిలు కోరికల్ని నియంత్రించుకోవాలి.. కోర్టు సంచలన వ్యాఖ్యలు
ప్రవళిక బలవన్మరణంపై రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఆందోళన చేసిన 13మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. 143, 148, 341, 332, R/W 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయారెడ్డి, ఓయూ నేత సురేశ్ యాదవ్, భాను ప్రకాశ్, నీలిమ, జీవన్ లపై కేసులు నమోదయ్యాయి.