Biggest Data Theft : డేటా కావాలా నాయనా..! 66కోట్ల మంది డేటా చోరీ కేసులో షాకింగ్ విషయాలు

రూ.1200కు 10వేల మంది డేటా, రూ.1500కు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్ష మంది డేటాను విక్రయించిందీ ముఠా.

Biggest Data Theft : డేటా కావాలా నాయనా..! 66కోట్ల మంది డేటా చోరీ కేసులో షాకింగ్ విషయాలు

Updated On : April 2, 2023 / 11:09 PM IST

Biggest Data Theft : డేటా చోరీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. పలు కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులిచ్చారు. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్లడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన 11 కంపెనీల్లో బిగ్ బాస్కెట్, ఫోన్ పే, ఫేస్ బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, మ్యాట్రిక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెక్ మహీంద్రా సంస్థలు ఉన్నాయి.

డేటా చోరీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి నుంచి పోలీసులు రెండు సెల్ ఫోన్లు, రెండు ల్యాప్ ట్యాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

Also Read..Data Theft : వామ్మో.. రూ.3వేలకు లక్ష మంది డేటా విక్రయం

ఈ ల్యాప్ టాప్ లలో 66.9 కోట్ల మందికి సంబంధించిన వ్యక్తిగత డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వివరాలను నిందితుడు వినయ్ భరద్వాజ సేకరించి విక్రయిస్తున్నట్లుగా తేల్చారు. ఇన్ స్పైర్ వెబ్జ్(InspireWebz) అనే వెబ్ సైట్ ను తయారు చేసి దాని ద్వారా చోరీ చేసిన డేటాను నిందితుడు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

జీఎస్టీ, పాన్ కార్డ్, అమెజాన్, నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, ఇన్ స్టాగ్రామ్, బుక్ మై షో సంస్థల నుంచి నిందితుడు వ్యక్తిగత డేటాను చోరీ చేశాడు. అలాగే బైజూన్ నుంచి 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల వ్యక్తిగత వివరాలను సేకరించినట్లు దర్యాఫ్తులో తేలింది. మొత్తం 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాల నుంచి.. వినయ్ భరద్వాజ.. డేటా చోరీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

Also Read..Massive Data Theft : షాకింగ్.. ఏపీలో 2కోట్ల మంది, హైదరాబాద్‌లో 56లక్షల మంది డేటా చోరీ

నిందితుడు వినయ్ భరద్వాజ 6 మెట్రోపాలిటిన్ నగరాల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. వారి ద్వారా నీట్, పాన్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఐటీ, డిఫెన్స్ కు చెందిన అధికారుల డేటాను చోరీ చేశాడు. ఇందులో 56లక్షల మంది హైదరాబాదీల డేటా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఏపీ నుంచి 2కోట్ల 10లక్షల మంది వ్యక్తిగత సమాచారం చోరీ అయ్యిందని తేల్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులతో పాటు 104 విభాగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల డేటా చోరీ చేసి విక్రయించినట్లు నిర్ధారించారు.

రూ.3వేలకే లక్ష మంది వ్యక్తిగత సమాచారం:
రూ.1200కు 10వేల మంది డేటా, రూ.1500కు 30వేల మంది డేటా, రూ.2వేలకు 50వేల మంది డేటా, రూ.3వేలకు లక్ష మంది డేటాను విక్రయించిందీ ముఠా. ఈ డేటాను కొన్నవారు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. మరోవైపు డేటా చోరీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ.. సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేశారు.