Bird Flu: మళ్లీ విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. హైదరాబాద్ శివారు ప్రాంతంలో వేలాది కోళ్లు మృత్యువాత
తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ప్లూ బారినపడి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

Bird Flu
Bird Flu: తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ప్లూ బారినపడి వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ మండలంలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చోటు చేసుకుంది. ఓ ఫౌల్ట్రీ ఫామ్ లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి.
గత నాలుగు రోజుల క్రితం నగర శివారులోని ఓ ఫౌల్ట్రీలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. అధికారులు చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించారు. బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యాజమానులు ఆందోళన చెందుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, మరోసారి అదే ప్రాంతంలోని ఫౌల్ట్రీ ఫామ్ లలో అధికారులు మరోసారి శాంపిల్స్ ను సేకరించారు. కోళ్లు కానీ, కోడిగుడ్లను కానీ అమ్మొద్దని పౌల్ట్రీ యాజమానులను అధికారులు ఆదేశించారు.
హైదరాబాద్ లోని అధిక శాతం చికెన్ దుకాణాలకు కోళ్లు, కోడి గుడ్లు నగర శివార్లలోని, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఫౌల్ట్రీ ఫామ్ ల నుంచి సరఫరా అవుతుంటాయి. ప్రస్తుతం నగర శివార్లలోని ఫౌల్ట్రీ ఫామ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతోపాటు.. పలు ఫామ్ లలోని కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగానే మరణించినట్లు నిర్ధారణ కావడంతో నగరంలోని చికెన్ ప్రియులు భయాందోళన చెందుతున్నారు.