కూకట్‌పల్లి బీజేపీ కార్యాలయం ధ్వంసం, కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

  • Publish Date - November 20, 2020 / 02:34 PM IST

attack on kukatpally bjp office: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. గ్రేటర్ లో సీట్ల లొల్లి తారస్థాయికి చేరింది. కూకట్ పల్లి నియోజకవర్గంలో టికెట్లను అమ్ముకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పార్టీ ఆఫీస్ లో ధ్వంసానికి దిగారు. ఆఫీసు అద్దాలు పగలగొట్టారు. కుర్చీలు విరగ్గొట్టారు. బ్యానర్లు చించేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గంలోని బీజేపీ అభ్యర్థులకు కేటాయించే సీట్లను బీజేపీ మేడ్చల్ అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీశ్ రెడ్డి అమ్ముకున్నాడని కార్యకర్తలు ఆరోపించారు.

20ఏళ్లుగా పార్టీకి పని చేస్తున్న తమను కాదని పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఫతేనగర్, బాలానగర్, అల్విన్ కాలనీ, కూకట్ పల్లి డివిజన్లకు చెందిన కార్యకర్తలు బీజేపీ ఆఫీస్ పై దాడి చేశారు. పొన్నాల హరీష్ రెడ్డి, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పొన్నాల హరీష్ రెడ్డికి కిషన్ రెడ్డి సహకారం ఉందని కార్యకర్తలు ఆరోపించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున ఇతర పార్టీల నుంచి వలసలు వస్తున్నాయని బీజేపీ నేతలు ఆనందించేలోపే వారికి నిరసన సెగ తగిలింది. గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల వ్యవహారం వివాదానికి దారితీసింది. టికెట్లు ఆశించి భంగపడ్డ వారిలో కొందరు ఆత్మహత్యాయత్నం చేయగా, మరికొందరు ఎదురుతిరుగుతున్నారు. ఇప్పటికే లక్ష్మణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు