BJP : నేడు బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. 55 మందితో తొలి జాబితా రిలీజ్
తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా, వీరిలో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

BJP Candidates List
BJP First List : తెలంగాణ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులపై బీజేపీ హైకమాండ్ కసరత్తు పూర్తి చేసింది. 55 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. రాత్రి ఢిల్లీలో సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ ఎన్నికల బీజేపీ అభ్యర్థులపై సుదీర్ఘంగా చర్చించింది. గెలుపు, ఓటములు బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపినక చేసింది. ఫస్ట్ లిస్టుపై కసరత్తు పూర్తి చేసింది.
అయితే అభ్యర్థుల జాబితా ఇవాళ అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. బీజేపీ కీలక నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజారాబాద్ తోపాటు గజ్వేల్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పై పోటీకి దించే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉండగా, వీరిలో ముగ్గురిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
BJP : బీఆర్ఎస్ ముఖ్యనేతలే టార్గెట్.. ఆ నాలుగు స్థానాలపై బీజేపీ ఫుల్ ఫోకస్
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దింపే ఛాన్స్ ఉంది. ఇక బోధ్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ను కోరుట్ల నుంచి పోటీ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ముగ్గురు, నలుగురు మినహా ముఖ్యనేతలంతా అసెంబ్లీ బరిలో నింపే లిస్టును బీజేపీ హైకమాండ్ రెడీ చేసింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లను మినహాయించినట్లు తెలుస్తోంది.
మాజీ ఎంపీ జీ.వివేక్ చెన్నూరు నుంచి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ గద్వాల నుంచి పోటీ చేయనున్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మరోసారి దుబ్బాక బరిలోనే దిగనున్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఉన్న సస్పెన్స్ ఎత్తివేత అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి మొదటి లిస్టులోనే ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. స్పష్టత రాని స్థానాలపై మరింత కసరత్తు అనంతరం అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.